కవితవి పిట్టల దొరసాని మాటలు.. బీజేపీనే ఆమెకు రాజకీయ సమాధి కట్టింది: ఎంపీ ధర్మపురి అర్వింద్

  • కొత్త పార్టీ పెట్టినా కవితకు ఒరిగేది ఏమీ లేదని అర్వింద్ వ్యాఖ్య
  • బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా అని ప్రశ్న
  • బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదన్న అర్వింద్

కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పేరుతో ఆమె పార్టీని ప్రకటించారు. కవిత పార్టీపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై ఆమె చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 'పిట్టల దొరసాని' అంటూ కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గతంలో పిట్టల దొరను చూశారని, ఇప్పుడు కొత్త పార్టీ పేరుతో వస్తున్న 'పిట్టల దొరసాని'ని ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


నిజామాబాద్ గడ్డపైనే కవితకు బీజేపీ రాజకీయ సమాధి కట్టిందని అర్వింద్ గుర్తు చేశారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టినా ఆమెకు పుట్టగతులు ఉండవని వ్యాఖ్యానించారు. బీజేపీ మద్దతు లేకుండానే తెలంగాణ వచ్చిందా? అని కవితను ప్రశ్నించారు. విభజన ప్రక్రియను బీఆర్ఎస్ నేతలు సరిగ్గా నిర్వహించక పోవడం వల్లే అనేక మంది బలిదానాలు జరిగాయని ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలనలో సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టే ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి బీజేపీని గెలిపించారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ఇక, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ అదృష్టం బాగుందని, అందుకే ఆయన మంత్రి, ఎమ్మెల్సీ కాగలిగారని అర్వింద్ పేర్కొన్నారు. గవర్నర్ కోటాలో ఆయనకు లబ్ధి చేకూరిందని అన్నారు.


Dharmapuri Arvind
Kavitha
Telangana Rashtra Sena
BJP
Nizamabad
Telangana Politics
Tejasvi Surya
Azharuddin
BRS
Telangana

More Telugu News