ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. రంగంలోకి దిగిన చంద్రబాబు!

  • ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ కొరత
  • ఇబ్బంది పడుతున్న వాహనదారులు, రైతులు
  • సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం
  • పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో మాట్లాడిన సీఎం
  • ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచన

రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించి, కీలక ఆదేశాలు జారీ చేశారు.


వరి కోతల సమయంలో డీజిల్ దొరక్కపోవడంతో యంత్రాలు పొలాల్లోనే నిలిచిపోయాయి. అటు ఆక్వా రైతులు కూడా ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు సరఫరాను నియంత్రించాయి. దీనికి తోడు కంపెనీలు క్రెడిట్ ఆప్షన్‌ను రద్దు చేయడం, పాత బకాయిలు ఉన్న బంకులకు స్టాక్ నిలిపివేయడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

పెట్రోల్, డీజిల్ సమస్య తీవ్రతరం అవుతుండటంతో, సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. సమస్యను తక్షణం పరిష్కరించాలని సీఎస్, పౌరసరఫరాల అధికారులను సీఎం ఆదేశించారు. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో కూడా మాట్లాడారు. స్టాకు లేని బంకుల వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని సూచించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, వినియోగదారులు ఇబ్బంది పడకుండా చూసుకోవాలని చెప్పారు. 

మరోవైపు, పెట్రోల్ స్టాక్ సమస్య ఉంటే వెంటనే ఆ బంక్ వారు 1967 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయాలని కమిషనర్ సూచించారు. 

Chandrababu Naidu
Andhra Pradesh
Petrol shortage
Diesel shortage
Fuel crisis
Godavari districts
Kurnool
Nandyala
Oil companies
Petroleum dealers

More Telugu News