అక్షయ్ కుమార్ కూతురిని వేధించిన వ్యక్తి అరెస్ట్
- 13 ఏళ్ల నిటారకు ఆన్‌లైన్ గేమింగ్ వేదికగా వేధింపులు
- పరిచయం పెంచుకుని, నగ్న చిత్రాలు పంపాలని వేధించిన అపరిచితుడు
- నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన పోలీసులు
అక్షయ్ కుమార్ కుమార్తె నిటారను ఆన్‌లైన్ గేమింగ్ వేదికగా వేధించిన నిందితుడిని మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో ప్రవేశపెడుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ అరెస్టుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ముంబైలో జరిగిన సైబర్ అవగాహన సదస్సులో అక్షయ్ కుమార్ స్వయంగా తన కూతురికి ఎదురైన అనుభవాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. వేధింపుల విషయానికి వెళితే... 13 ఏళ్ల నిటార వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో ఒక అపరిచితుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మొదట బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించి, ఆ తర్వాత అసభ్యకరమైన మెసేజ్‌లు (నగ్న చిత్రాలు పంపాలని) పంపుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిటార ఏమాత్రం భయపడకుండా వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, తన తల్లి ట్వింకిల్ ఖన్నాకు విషయాన్ని వివరించింది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నిందితుడిని పట్టుకోవడం సులభమైందని పోలీసులు తెలిపారు.
మరోవైపు, పిల్లలకు మొబైల్ ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఏ సమస్య వచ్చినా భయం లేకుండా తల్లిదండ్రులతో పంచుకునేలా పిల్లలకు గైడెన్స్ ఇవ్వాలని అక్షయ్ పేర్కొన్నారు.