ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు ఫలప్రదం.. తెలంగాణలో రేపటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు!

  • సమ్మె విరమించేందుకు కార్మిక సంఘాల అంగీకారం
  • శనివారం ఉదయం నుంచి యథావిధిగా బస్సు సర్వీసులు
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన భేటీ
  • అధికారికంగా వెలువడనున్న ప్రకటన
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెరపడనుంది. ప్రభుత్వంతో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు జరిపిన చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నేతలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, శనివారం ఉదయం మొదటి షిఫ్ట్ నుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ నేతలతో సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు, పెన్షన్లు, ఇతర ప్రధాన డిమాండ్లపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

జేఏసీ నేతలు ప్రస్తావించిన అంశాలపై మంత్రుల బృందం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ హామీతో జేఏసీ నేతలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సానుకూల పరిణామంతో ఆర్టీసీ సేవలు తిరిగి సాధారణ స్థితికి రావడానికి మార్గం సుగమమైంది. సమ్మె విరమణ వార్తతో ప్రయాణికులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

RTC Strike
TGSRTC
JAC
Govt
Talks
Congress
Telangana

More Telugu News