నేటితో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ ముగిసింది... లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ

Paytm Payments Bank License Cancelled by RBI
  • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్
  • వెంటనే బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశం
  • డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణం
  • బ్యాంకును మూసివేయాలని హైకోర్టును ఆశ్రయించనున్న ఆర్బీఐ
  • డిపాజిటర్లందరికీ డబ్బు చెల్లించేంత నగదు ఉందని వెల్లడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రముఖ యూపీఐ ఆధారిత ఆర్థిక సేవల సంస్థ పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్సును రద్దు చేసింది. నేడు (ఏప్రిల్ 24వ తేదీన) పనివేళలు ముగిసిన తర్వాత ఈ రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుందని ఆర్బీఐ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, సెక్షన్ 22(4) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నిర్ణయంతో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తక్షణమే ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధం విధించింది. బ్యాంకును పూర్తిగా మూసివేసే (వైండింగ్ అప్) ప్రక్రియ కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కూడా వెల్లడించింది.

అయితే, డిపాజిటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ భరోసా ఇచ్చింది. బ్యాంకు వద్ద ఉన్న డిపాజిటర్లందరికీ వారి డబ్బును తిరిగి చెల్లించేందుకు సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది.

బ్యాంకు కార్యకలాపాలు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉండటం, యాజమాన్యం తీరు ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండటం, లైసెన్స్ షరతులను ఉల్లంఘించడం వంటి కారణాలతో లైసెన్సును రద్దు చేసినట్లు ఆర్బీఐ వివరించింది. గతంలో 2022 మార్చి నుంచి కొత్త కస్టమర్ల చేరికపై, 2024 జనవరి నుంచి డిపాజిట్లు, టాప్-అప్‌లపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పూర్తిస్థాయిలో లైసెన్సును రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.
Go Back to Shorts
Paytm Payments Bank
RBI
Reserve Bank of India
Paytm
UPI
Banking license cancellation
Banking Regulation Act 1949
financial services
India

More Telugu News