చర్చలతోనే పరిష్కారం.. ప్రాణాలు తీసుకోవద్దు: ఆర్టీసీ నేతలతో భట్టి విక్రమార్క
- మంత్రుల బృందంతో జేఏసీ నేతల భేటీ
- డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మల్లు భట్టి
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సచివాలయంలో మంత్రుల బృందంతో కలిసి జేఏసీ నేతలతో భేటీ అయిన ఆయన, సమస్యలు ఎంత క్లిష్టమైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు. ఇది మనందరి 'ప్రజా ప్రభుత్వం' అని, ఎవరినీ శత్రువులుగా చూసే స్వభావం తమకు లేదని స్పష్టం చేశారు.
గత పదేళ్లలో ఆర్టీసీ చిన్నాభిన్నమైందని, అప్పట్లో కార్మికుల పట్ల పాలకులు కఠినంగా వ్యవహరించారని అన్నారు. తాము అలా చేయబోమని భరోసా ఇచ్చారు. వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, ఇతర ప్రభుత్వ పనుల వల్ల తాము బిజీగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా సమ్మె నిర్ణయం తీసుకోవడం వల్లే శంకర్ గౌడ్ ను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసి, కార్మికుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.