ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్లు డిస్మిస్!
- ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు ఏసీబీ కోర్టులో నిరాశ
- రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసిన కోర్టు
- ఈ కేసులో పలువురు నిందితులకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు చుక్కెదురైంది. ఒకవైపు వీరి నివాసాల్లో ఈడీ సోదాలు జరుగుతుండగానే, మరోవైపు న్యాయస్థానంలో కూడా వారికి ఊరట లభించకపోవడం గమనార్హం.
మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు విజయవాడ ఏసీబీ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం వాటిని డిస్మిస్ చేసింది.
ఈ కేసు విచారణ కీలక దశలో ఉన్నందున, నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్న ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు రెగ్యులర్ బెయిల్ పొందినప్పటికీ, ఈ ముగ్గురికి మాత్రం న్యాయస్థానం నుంచి ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో వీరు తదుపరి హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.