రాఘవ్ చద్దా ఎఫెక్ట్: రాజ్యసభలో ఆప్ డీలా... పెరగనున్న బీజేపీ బలం

  • ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ ఇచ్చిన ఎంపీ రాఘవ్ చద్దా
  • పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ ఎంపీల్లో 7 మందితో బీజేపీలో విలీనం
  • హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటన
  • ఆప్‌లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని చద్దా ఆరోపణ
  • తన స్థానంలో నియమించిన కొత్త డిప్యూటీ లీడర్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిన చద్దా
ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రాజ్యసభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాతో పాటు మొత్తం ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. రాఘవ్ చద్దాతో కలిసి ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్ వంటి ముఖ్య నేతలు కూడా పార్టీ మారడం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడిన రాఘవ్ చద్దా, ఆప్‌లోని పది మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు సభ్యులం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. 

ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్‌లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన రాఘవ్ చద్దా, తమ వర్గం బీజేపీలో విలీనం అవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. "రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణంగా, రాజ్యసభలోని ఆప్ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిమి బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఈ పరిణామంతో రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరగనుంది. ప్రస్తుతం బీజేపీ 106 మంది సభ్యులతో పెద్దల సభలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. తాజాగా ఆప్ నుంచి ఏడుగురు ఎంపీల చేరికతో బీజేపీ బలం 113కి పెరగనుంది. అంతేకాదు, మిత్రపక్షాలతో కలిపి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలం 125కి చేరుతుంది.

కొన్ని రోజుల క్రితమే రాఘవ్ చద్దాను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆప్ అధిష్ఠానం తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను నియమించింది. అయితే, ఇప్పుడు చద్దాతో పాటు ఆ కొత్త డిప్యూటీ లీడర్ అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరనుండడం గమనార్హం. పార్టీతో విభేదాల నేపథ్యంలో ఇటీవల చద్దా తన పార్లమెంటరీ పనితీరును వివరిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ తాజా పరిణామంతో ఆప్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది.

Raghav Chadha
AAP
Rajya Sabha
BJP
Delhi

More Telugu News