తమిళనాడు, బెంగాల్ లో ముగిసిన పోలింగ్... రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు

Polling concluded in Tami Nadu and Bengal
  • సాయంత్రం 5 గంటలకే తమిళనాడులో 82.24%, బెంగాల్‌లో 89.93% ఓటింగ్
  • కన్యాకుమారిలో పడవల్లో డ్యామ్ దాటి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న గిరిజనులు
  • 2021 ఎన్నికల నాటి పోలింగ్ శాతాన్ని అధిగమించిన రెండు రాష్ట్రాలు
  • డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలుస్తుందని ఎండీఎంకే నేత వైగో ధీమా
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేఏ అవకాశం కల్పించారు. ఇవాళ తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, పశ్చిమ బెంగాల్ లో 152 స్థానాల్లో తొలి విడత పోలింగ్ నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ప్రజలు, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఉత్సాహం ప్రదర్శించారు. 

ఎన్నికల సంఘం అంచనాల ప్రకారం, సాయంత్రం 5 గంటలకే పశ్చిమ బెంగాల్‌లో 89.93 శాతం, తమిళనాడులో 82.24 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 82 శాతం, 74 శాతం కంటే గణనీయంగా అధికం కావడం గమనార్హం. ఎన్నికలకు ముందు తీవ్ర వివాదానికి దారితీసిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) డ్రైవ్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోగా, పోలింగ్ శాతం ఊహించని స్థాయికి చేరడం విశేషం.

తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ, నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టీకే), తమిళగ వెట్రి కళగం (టీవీకే) మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. 

చెన్నైలో పోలింగ్ చివరి గంటలో, ఓటర్లు తమ హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసింది. ఏఐఏడీఎంకే అభ్యర్థి డి. జయకుమార్, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ వంటి ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

ఈ ఎన్నికల్లో కన్యాకుమారి జిల్లాలో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరిసింది. రోడ్డు సౌకర్యం లేని మారుమూల కొండ ప్రాంతాలకు చెందిన ‘కని’ గిరిజన తెగ ప్రజలు, పెచిపారై డ్యామ్‌లో పడవలపై ప్రయాణించి వచ్చి మరీ ఓటు వేశారు. డ్యామ్‌లో నీటిమట్టం ఎక్కువగా ఉండటంతో, జిల్లా యంత్రాంగం లైఫ్ జాకెట్లతో కూడిన మూడు ప్రత్యేక పడవలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా పోలింగ్ కేంద్రాలకు తరలించింది. మరోవైపు, డీఎంకే కూటమి 200కు పైగా స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని ఎండీఎంకే నేత వైగో ధీమా వ్యక్తం చేశారు.

అదేవిధంగా, పశ్చిమ బెంగాల్‌లో తొలి విడతలో భాగంగా 16 జిల్లాల పరిధిలోని 152 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్, డార్జిలింగ్, జల్‌పాయ్‌గురి, దక్షిణ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, పురులియా, బంకురా వంటి జిల్లాల్లో ఓటర్లు భారీగా తరలివచ్చారు. మిగిలిన 142 నియోజకవర్గాలకు రెండో విడత పోలింగ్ ఏప్రిల్ 29న జరగనుంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టి, ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఫలితాలు రెండు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
Go Back to Shorts
Assembly Election
Tamil Nadu
West Bengal
Voting
Polling Day
Assembly Polls

More Telugu News