ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. శుక్రవారం శుభవార్త?

  • ఇరాన్‌తో శాంతి చర్చలపై ట్రంప్ ఆశాభావం
  • శుక్రవారం శుభవార్త ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
  • ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్
  • చర్చలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టీకరణ
ఇరాన్‌తో రెండో విడత శాంతి చర్చలపై శుక్రవారం నాటికి 'శుభవార్త' వెలువడొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 36 నుంచి 72 గంటల్లో చర్చలు పునఃప్రారంభం కావచ్చని ఇవాళ 'న్యూయార్క్ పోస్ట్' సైతం ఓ కథనాన్ని ప్రచురించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ "అది సాధ్యమే" అని బదులివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు అనుబంధంగా పనిచేసే 'తస్నీమ్ న్యూస్' ఏజెన్సీ ఈ మేరకు 'ఎక్స్'లో ఓ పోస్ట్ చేసింది. "ట్రంప్ మళ్లీ అబద్ధం చెప్పారు. శుక్రవారం చర్చలు జరిపే అంశంపై ఇరాన్‌కు ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం లేదు" అని స్పష్టం చేసింది.

శాంతి చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణను ట్రంప్ పొడిగించారు. 

ఈ వ్యూహ మార్పునకు పాకిస్థాన్ నాయకత్వంతో జరిపిన సంప్రదింపులే కారణమని ట్రంప్ పేర్కొన్నారు. "ఇరాన్ ప్రభుత్వం అంతర్గతంగా తీవ్రంగా చీలిపోయింది. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభ్యర్థన మేరకు.. ఇరాన్ నేతలు ఒక ఏకీకృత ప్రతిపాదనతో వచ్చేవరకు ఆ దేశంపై దాడిని నిలిపివేయాలని నిర్ణయించాం" అని ట్రంప్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. "మా సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని, దిగ్బంధనాన్ని కొనసాగించాలని ఆదేశించాను. ఇరాన్ ప్రతిపాదన వచ్చేవరకు కాల్పుల విరమణను పొడిగిస్తున్నాను" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Donald Trump
Good News
Talks With Iran

More Telugu News