ఉద్యోగుల పాలిట నరరూప రాక్షసుడు జగన్: అశోక్ బాబు

  • వెంకట్రామిరెడ్డి జగన్ హయాంలోనే సస్పెండ్ అయ్యారని వెల్లడి
  • వాస్తవాలు తెలుసుకొని జగన్ మాట్లాడాలని సూచన
  • ఉద్యోగులకు జగన్ రూ.30 వేల కోట్ల బకాయిలు పెట్టారని ఆగ్రహం
  • వాటిలో తాము రూ.22 వేల కోట్లు మేం చెల్లించామన్న అశోక్ బాబు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిచినందుకు వెంకట్రామిరెడ్డి జగన్ ప్రభుత్వంలోనే సస్పెండ్ అయ్యారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరి అశోక్ బాబు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మీరు తప్పు చేశారంటూ జగన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.

జగన్ నిజం ఒప్పుకుంటున్నాడని, ఎందుకంటే ఆయన చేసిన తప్పులకు జైల్లో పెట్టకుండా చంద్రబాబు తప్పు చేశారని చురక అంటించారు. చంద్రబాబు ఆ తప్పు చేయడం వల్లే జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 ఏప్రిల్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కాండక్ట్ రూల్స్ ను బ్రేక్ చేసి కాకర్ల వెంకట్రామిరెడ్డి, చల్లా చంద్రయ్యలు వైసీపీ జెండాలు పట్టుకొని కడప జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల్లో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారని ఆరోపించారు.

అవినీతి, పనిపట్ల నిబద్ధత లేకపోవడం, పనిచేయకపోవడం వంటి వాటికి కాండక్ట్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. 2024 ఏప్రిల్ 2న బద్వేల్ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కు రిపోర్ట్ పెట్టారని, దీనితో అదే రోజున 137/2024, 81/2024, 116/2024, 166/2024 నాలుగు ఎఫ్ఐఆర్‌లు కాకర్ల వెంకట్రామిరెడ్డి, చల్లా చంద్రయ్యలపై నమోదయ్యాయని గుర్తు చేశారు. బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప డిపోల్లో వైసీపీ యూనియన్ నాయకుడు చల్లా చంద్రయ్యతో కలిసి వెంకట్రామిరెడ్డి వీసీకి అనుకూలంగా జెండాలు పట్టుకొని ప్రచారం చేశాడు కాబట్టే నాలుగు చోట్ల ఎఫ్ఐఆర్ నమోదు అయిందని అన్నారు. 2024 ఏప్రిల్ 2న ఏపీలో జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉందని అన్నారు. సచివాలయ ఉద్యోగిగా ఉండి ప్రచారం చేసినందుకు బద్వేల్ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.

జీఓ 464లో ఈ వివరాలు అన్నీ ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కడప కలెక్టర్ నివేదిక ఇస్తే, దాని ఆధారంగా తమ ప్రభుత్వం విచారణ జరిపిందని అన్నారు. 2024 ఏప్రిల్ 18న నివేదిక ఇస్తే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే వెంకట్రామిరెడ్డిని పంచాయితీ రాజ్ సెక్రటరీ సస్పెండ్ చేశారని తెలిపారు. అప్పుడే ఆర్టీసీ ఉద్యోగి చల్లా చంద్రయ్యను కూడా సస్పెండ్ చేశారని వెల్లడించారు. ఆ సమయంలో అధికారంలో ఉన్నది కూడా జగన్ రెడ్డే అన్నారు. తప్పు చేశారు కాబట్టే జగన్ ప్రభుత్వంలోనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు ప్రారంభమయ్యాయని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆగస్టులో విచారణ ప్రారంభించామని అన్నారు. ఏ కారణాలతో సస్పెండ్ చేశారో తెలుసుకునేందుకు విచారణ జరిపామని అన్నారు. విచారణలో తప్పు చేశాడని తెలియడంతో డిస్మిస్ చేశామని అన్నారు.

ఒక సెక్షన్ అధికారిని సస్పెండ్ చేస్తే చంద్రబాబు "నువ్వు తప్పు చేస్తున్నావ్" అని జగన్ అనడమేమిటని ప్రశ్నించారు. వెనకేసుకు రావడానికి మీకు వెంకట్రామిరెడ్డి ఒక్కడే రాష్ట్ర ఉద్యోగియా అని నిలదీశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రామకృష్ణను సస్పెండ్ చేసి జైల్లో పెట్టారని, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో చాలామందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఏబీ వేంకటేశ్వరరావు, ఎల్వీ సుబ్రహ్మణంను ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను వేధించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన పాపానికి దళిత కానిస్టేబుల్ ను వేధించారని, ఇవన్నీ తమ హయంలో జరగలేదని, జగన్ పాలనలో జరిగాయని ధ్వజమెత్తారు. వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తే అంతా అధర్మం జరిగినట్లు జగన్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దళితుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకున్నారని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు.. చేయబోరని అన్నారు. తనపై సీఐడీ కేసు పెట్టి వేధించారని తెలిపారు.

గచ్చిబౌలిలోని సెక్రటేరియట్ హౌసింగ్ కాలనీలో డైరెక్టర్ గా మారి అప్పుడు ఉన్న వ్యక్తిని దించేసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ఆరోపించారు. ఖాళీ స్థలాలను ప్లాట్లుగా ఇచ్చేసి ప్రజల స్థలాన్ని అమ్ముకున్నారని అన్నారు. విచారణ చేస్తే మొత్తం సోసైటీని రద్దు చేసే పరిస్థితిని తీసుకొచ్చిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని ధ్వజమెత్తారు. ఆయన జగన్ హస్తంతోనే సచివాలయ ప్రెసిడెంట్ అయ్యాడని ఆరోపించారు. ఉద్యోగులకు ఆయన చేసిన మంచి కూడా ఏదీ లేదని అన్నారు. ఉద్యోగులను బెదిరించి బయపెట్టడం వెంకట్రామిరెడ్డి చేసిన పనే అని ఆరోపించారు. వేల మంది ఉద్యోగులు కరోనా సమయంలో నష్టపోయారు, చనిపోయారు, కానీ ఆయన ఒక్కరికైనా సాయం చేశారా అని నిలదీశారు. ఉద్యోగుల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని అశోక్ బాబు అన్నారు. ఉద్యోగుల పాలిట నరకాసురుడు జగన్ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఉన్నాయని, కనీసం ఒక్క సంఘమైనా ఉద్యోగులకు జగన్ మంచి చేశాడని చెబుతారా అని ప్రశ్నించారు. వెంకట్రామిరెడ్డి భార్యకు ముషీరాబాద్ వైసీపీ టికెట్ అడిగారని, వెంకట్రామిరెడ్డి జగన్ కు దగ్గరి బంధువు కూడా అన్నారు. కాండాక్ట్ రూల్స్ లో ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించకూడదని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉన్న రూల్స్‌ను వెంకట్రామిరెడ్డి బ్రేక్ చేసినందువల్లే డిస్మిస్ అయ్యాడని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు బాకీలు పెట్టిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే రూ.22,000 వేల కోట్లు చెల్లించామని, సీపీఎస్ అప్ గ్రేడ్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారని అన్నారు. పేపర్, టీవీ ఉందని ఏది పడితే అది మాట్లాడితే జనం అంగీకరించరని అన్నారు. మీ ప్రభుత్వంలోనే వెంకట్రామిరెడ్డి సస్పెండ్ అయ్యారనే విషయం గుర్తించాలని హితవు పలికారు. వెకంట్రామిరెడ్డి జగన్ కంటే ఎక్కువ అరాచకాలు చేశాడని వ్యాఖ్యానించారు. వెంకట్రామిరెడ్డి డిస్మిస్ ఏ సందర్భంలో జరిగిందో వివరణ ఇచ్చేందుకు సిద్ధమని అన్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబం మొత్తం వైసీపీ కార్యకర్తలేనని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల కాండక్ట్ రూల్స్ ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుందని అశోక్ బాబు తెలిపారు.

Ashok Babu on YS Jagan
Ashok Babu on Venkatrami Reddy
Andhra Pradesh politics

More Telugu News