ఐఐటీ తిరస్కరణ.. ఆరేళ్లు చదివిన డిగ్రీ.. అయినా మైక్రోసాఫ్ట్‌లో కోటి 20 లక్షల జాబ్!

IIT Failure To Rs 12 Crore Microsoft Job Offer Techie Shares Journey Of Never Giving Up
  • ఎన్నో అపజయాల తర్వాత మైక్రోసాఫ్ట్‌లో రూ. 1.2 కోట్ల ప్యాకేజీ సాధించిన టెక్కీ
  • ఐఐటీ ఫెయిల్, నాలుగేళ్ల డిగ్రీకి ఆరేళ్లు పట్టిందని వెల్లడి
  • విఫలమైన స్టార్టప్‌లు, టాక్సిక్ బాస్‌లతో ఇబ్బందులు పడ్డానని ఆవేద‌న‌
  • వైఫల్యాలు నన్ను ఆపలేదు, కేవలం ఆలస్యం చేశాయంటూ స్ఫూర్తిదాయక పోస్ట్
  • సోషల్ మీడియాలో టెక్కీ పట్టుదలను ప్రశంసిస్తున్న నెటిజన్లు
సాధారణంగా జీవితంలో ఒకటి రెండు వైఫల్యాలు ఎదురైతేనే కుంగిపోతుంటారు. కానీ, ఓ టెక్కీ మాత్రం ఎన్నో అపజయాలను, అవమానాలను తట్టుకుని నిలబడి, చివరికి తాను కలలు కన్న విజయాన్ని అందుకున్నారు. వరుస వైఫల్యాల తర్వాత టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఏకంగా రూ. 1.2 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు. "ఐఐటీ తిరస్కర‌ణ‌ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు" అనే శీర్షికతో తన ప్రయాణాన్ని రెడిట్‌లో పంచుకోగా, ఇప్పుడీ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైఫల్యాల ప్రస్థానం
"ఇది అట్టడుగు స్థాయి నుంచి అగ్రస్థానానికి చేరిన కథ కాదు, కష్టాలు ఎదురైనప్పుడు వెనకడుగు వేయని ఒకరి కథ" అంటూ తన పోస్ట్‌ను ప్రారంభించారు. "12వ తరగతి తర్వాత ఐఐటీ సీటు కోసం ఏడాది డ్రాప్ తీసుకున్నాను. కానీ నా ర్యాంక్ మెరుగుపడకపోగా, మరింత దిగజారింది. దాంతో టైర్-2 ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను. నాలుగేళ్ల డిగ్రీని పూర్తి చేయడానికి నాకు ఆరేళ్లు పట్టింది" అని అందులో పేర్కొన్నారు. చదువు తర్వాత కొన్ని స్టార్టప్‌లలో పనిచేసినా అవన్నీ విఫలమవడంతో మళ్లీ కాలేజీకి వెళ్లి బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసుకుని డిగ్రీ పూర్తి చేశానని తెలిపారు.

టాక్సిక్ బాస్‌లు.. మానసిక వేదన
ఆ తర్వాత సేల్స్ ఉద్యోగం, టైర్-2 కాలేజీలో ఎంబీఏ చేశారు. మిడిల్ ఈస్ట్‌లోని ఒక కంపెనీలో చేరితే, అక్కడి బాస్ ప్రతిరోజూ నరకం చూపించాడని వాపోయారు. అమెరికాలో పీహెచ్‌డీకి అడ్మిషన్ వచ్చినా, కోవిడ్ కారణంగా ఆ ప్రణాళిక రద్దయింది. దాంతో ఏమీ లేకుండానే భారత్‌కు తిరిగి వచ్చారు. ఇండియాకు వచ్చాక రూ. 11 లక్షల ప్యాకేజీతో ఒక స్టార్టప్‌లో, ఆ తర్వాత రూ. 22 లక్షలతో మరో స్టార్టప్‌లో చేరారు. అయితే రెండో కంపెనీలో బాస్ వేధింపులు, ప్రతికూల వాతావరణం కారణంగా తన జీతంలో ఎక్కువ భాగం థెరపీ, మందులకే పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయం ఆలస్యమైంది కానీ..
31 ఏళ్ల వయసులో బెంగళూరులోని ఓ పెద్ద కంపెనీలో రూ. 27 లక్షల ప్యాకేజీతో చేరారు. అప్పటికే తన సహచరులు రెట్టింపు సంపాదిస్తున్నారని, దాంతో ఇతరులతో పోల్చుకోవడం మానేసి, తన పనిపైనే దృష్టి పెట్టానని వివరించారు. "అలా తన పని తాను చేసుకుపోతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ నుంచి పిలుపు వచ్చింది. ఇప్పుడు రూ. 1.2 కోట్లకు పైగా ప్యాకేజీతో ఆ కంపెనీలో చేరబోతున్నాను. టైర్-2 కాలేజీ, ఆరేళ్ల డిగ్రీ, విఫలమైన స్టార్టప్‌లు, టాక్సిక్ బాస్‌లు, థెరపీ.. ఇవేవీ నన్ను అనర్హుడిని చేయలేదు. కేవలం కాస్త ఆలస్యం చేశాయి అంతే. మీరు కూడా ఇలాంటి దశలోనే ఉంటే, అక్కడే ఉండండి. మీ పని మీరు చేయండి. నమ్మకాన్ని వీడొద్దు" అని ముగించారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ టెక్కీ పట్టుదలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. "మీ కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం", "విజయం అనేది సరళరేఖలో పయనించదనే దానికి మీరే నిదర్శనం" అంటూ అభినందనలు తెలుపుతున్నారు.
Go Back to Shorts
Microsoft Job Offer
Techie
IIT Failure
Never Giving Up

More Telugu News