ఏపీ లిక్కర్ స్కామ్: ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ సిట్ లేఖలు
- లిక్కర్ కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ31 ధనుంజయ రెడ్డి
- వీరిని ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ, ఐఆర్‌టీఎస్ కు సిట్ లేఖలు
- ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నిందితులు
ఏపీ మద్యం కుంభకోణం కేసు విచారణ ఇప్పుడు మరో కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన ఇద్దరు కీలక అధికారులపై న్యాయ విచారణ జరిపేందుకు సిట్ వేగంగా అడుగులు వేస్తోంది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవ రెడ్డిలను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సంబంధిత విభాగాలకు సిట్ అధికారులు లేఖలు రాశారు.
అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ప్రభుత్వ అధికారులపై న్యాయ విచారణ జరపాలంటే వారు పని చేసే విభాగాల నుంచి ముందస్తు అనుమతి అవసరం. ఈ నేపథ్యంలో ధనుంజయ రెడ్డి ప్రాసిక్యూషన్ కోసం డీఓపీటీకి, వాసుదేవ రెడ్డి కోసం ఐఆర్‌టీఎస్ కు సిట్ లేఖలు పంపింది.
ఈ భారీ కుంభకోణంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డిని ఏ2 గా, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డిని ఏ31 నిందితుడిగా సిట్ పేర్కొంది. గతంలోనే వీరిద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారించారు. ప్రస్తుతం వీరు బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పుడు విచారణను వేగవంతం చేసే క్రమంలో ప్రాసిక్యూషన్ అనుమతి కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.