అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన.. యూఎస్ ఉపాధ్యక్షుడి పాక్ పర్యటన వాయిదా

  • పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల వాయిదా
  • ఇరాన్ నుంచి స్పష్టత రాకపోవడంతో అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన నిలిపివేత
  • పాకిస్థాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణను పొడిగించిన అధ్యక్షుడు ట్రంప్
  • అయితే హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టీకరణ
  • దిగ్బంధనం ఎత్తివేస్తేనే చర్చలని తేల్చిచెప్పిన ఇరాన్
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల పునరుద్ధరణపై నెలకొన్న ఉత్కంఠకు ప్రస్తుతానికి తెరపడలేదు. పాకిస్థాన్‌లో జరగాల్సిన రెండో విడత చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం చేయాల్సిన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. చర్చల్లో పాల్గొనడంపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడమే ఇందుకు కారణమని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో వెల్లడించారు. ఇరాన్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చేవరకు ఈ సీజ్‌ఫైర్ కొనసాగుతుందని తెలిపారు.

 అయితే, కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే అంశం చర్చలకు ప్రధాన అడ్డంకిగా మారింది. నౌకా దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు తాము చర్చలకు హాజరుకాబోమని ఇరాన్ తేల్చిచెప్పింది. అమెరికా చర్యల వల్ల వారి చిత్తశుద్ధిపై అనుమానాలు ఉన్నాయని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ పేర్కొన్నారు. దీంతో కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మెట్టుదిగని వైఖరి వల్ల చర్చల ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది.

JD Vance
US Iran talks
Iran
America
Pakistan
Shehbaz Sharif
Asim Munir
Hormuz Strait
ceasefire agreement
nuclear deal

More Telugu News