పోలవరంపై సందేహాలకు తెర.. పూర్తి ఎత్తుతోనే నిర్మాణం

Polavaram Project to Be Built at Full Height of 4572 Meters
  • పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెర
  • గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లుగా పీపీఏ అధికారిక ప్రకటన
  • కేంద్ర జలశక్తి కార్యదర్శి పర్యటన తర్వాత మారిన చిత్రం
  • వచ్చే ఏడాది జూన్‌ నాటికి తొలి దశ పనులు పూర్తికి లక్ష్యం
బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. ప్రాజెక్టును దాని పూర్తిస్థాయి ఎత్తయిన 45.72 మీటర్ల వద్దే నిర్మించనున్నట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారికంగా స్పష్టం చేసింది. దీంతో ప్రాజెక్టులో 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు మార్గం సుగమమైంది. పీపీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పొందుపరచడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టత వచ్చింది.

ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు ప్రాజెక్టును సందర్శించిన తర్వాత ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన పర్యటనకు ముందు, ప్రాజెక్టును తొలి దశలో 41.15 మీటర్లకే పరిమితం చేస్తారన్న సమాచారం పీపీఏ వెబ్‌సైట్‌లో ఉండేది. అయితే, కాంతారావు పర్యటన అనంతరం ఆ వివరాలను సవరించి, గరిష్ఠ నీటిమట్టం వివరాలను చేర్చారు. ప్రాజెక్టు రెండో దశకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు, భూసేకరణ, పునరావాసం వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీతో రెండో దశ పనులకు కేంద్రం సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరోవైపు, ప్రాజెక్టు తొలిదశ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని జల వనరుల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే స్పిల్‌వే నిర్మాణం పూర్తవగా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే 10.13 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటు, కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల నీటి తరలింపు, తాగునీరు, 960 మెగావాట్ల విద్యుదుత్పత్తి వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.

అయితే, రెండో దశ పనులు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనున్నాయి. రెండో దశ కోసం సుమారు 86,000 నిర్వాసిత కుటుంబాలను తరలించాల్సి ఉండగా, భూసేకరణ, పునరావాసానికి రూ.28,561 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
Go Back to Shorts
Polavaram Project
Polavaram
Andhra Pradesh
VL Kantharao
Irrigation Project
Water Resources
Dam Construction
AP Government
Polavaram Project Authority
PPA

More Telugu News