చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది: పార్థసారథి

  • పెద్ద దస్తగిరి హత్య వెనుక వైసీపీ అగ్రనేతల హస్తం ఉందన్న పార్థసారథి
  • దస్తగిరి ఇంట్లో వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ప్రశ్న
  • వైసీపీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్

వైసీపీ కేవలం రాజకీయ పార్టీ కాదని, అది హత్యా రాజకీయాలకు అడ్డాగా మారిందని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య వెనుక ఆ పార్టీ అగ్రనేతల హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. చీకట్లో చంపడం, పగలు వెళ్లి పరామర్శించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని అన్నారు.


హత్యకు గురైన పెద్ద దస్తగిరి ఇంట్లో జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తి పత్రాలు ఎలా దొరికాయని ఆయన ప్రశ్నించారు. దస్తగిరి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి, రవీంద్రనాథ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, ఆస్తుల గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద దస్తగిరి హత్యకు కారకులైన నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.


వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి పెద్ద దస్తగిరి హత్య వరకు వైసీపీ ఒకే తరహా నాటకాలు ఆడుతోందని, అధికారం కోసం ఆ పార్టీ నేతలు ఎంతకైనా దిగజారుతారని విమర్శించారు. వైసీపీకి రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదని అన్నారు. జగన్ అండ్ కో పాపాలను ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అనుమతులపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.

Parthasarathy
TDP
Pedda Dastagiri
YSRCP

More Telugu News