ఢిల్లీ అగ్ని ప్రమాదం.. వంటమనిషి చేసిన తప్పే అంతమంది ప్రాణాలు తీసిందా?
- ఢిల్లీ హోటల్ ప్రమాదంలో వంటమనిషి అరెస్ట్
- స్టవ్ పేలడంతో పవర్ ఆఫ్ చేసిన కేశవ్ నేగి
- కరెంట్ పోవడంతో లాక్ అయిన ఎలక్ట్రానిక్ తలుపులు
- బయటకు రాలేక 21 మంది మృతి
- విచారణ ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు
పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం కేశవ్ కిచెన్‌లోని ఎలక్ట్రిక్ స్టవ్‌ను ఆన్ చేయగానే అది ఒక్కసారిగా పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భయపడిన కేశవ్ మంటలను ఆర్పే ప్రయత్నం చేయకుండా.. హోటల్ ‘మెయిన్ పవర్ స్విచ్’ను పూర్తిగా ఆఫ్ చేసి దట్టమైన పొగ నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు పరుగు తీశాడు.
అయితే కేశవ్ పవర్ సప్లైని నిలిపివేయడంతో హోటల్‌లోని ఎలక్ట్రానిక్ సెన్సార్ తలుపులు అన్నీ జామ్ అయి శాశ్వతంగా లాక్ అయిపోయాయి. దీంతో లోపల ఉన్న అతిథులు బయటకు రావడానికి మార్గం లేక గదుల్లోనే చిక్కుకుపోయారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ఓ గదిలోని భార్యాభర్తలు బాత్‌రూమ్ డోర్ లాక్ అయిపోవడంతో బయటకు రాలేక లోపలే ఊపిరాడక విగతజీవులుగా మారారు.
ఐదంతస్తుల ఉన్న ఈ ఇరుకైన హోటల్ భవనంలో మొత్తం 22 గదులు ఉన్నాయి. కానీ, ద్వారం మాత్రం ఒకటే ఉండడం, కిటికీలన్నీ శాశ్వతంగా మూసివేసి ఉండటం వల్ల మరణాల సంఖ్య భారీగా పెరిగింది. 2022 తర్వాత దేశ రాజధానిలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదంగా నమోదైన ఈ ఘటనపై పోలీసులు హోటల్ సిబ్బందితో పాటు ఇతరులను విచారిస్తున్నారు.