తెలంగాణలో యువ‌త అంతా ఏమైంది?.. 75 ఏళ్ల వ్యక్తి నవ యువకుడా?: కేసీఆర్ సభపై కవిత సెటైర్లు

Kavitha Slams Kcr Jagtial Speech No Respect For Women In Brs
  • ఈ నెల‌ 25న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న కల్వకుంట్ల కవిత
  • మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
  • యూత్ రాజ‌కీయాల్లోకి రావాలంటూ జాగృతి అధ్యక్షురాలు పిలుపు
  • త‌న పార్టీలో యువతకు ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామని వ్యాఖ్య‌
  • జీవన్ రెడ్డి చేరికపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన కవిత
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటన
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదికగా కొత్త రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు. తన కొత్త పార్టీలో యువతకు, తెలంగాణ ఉద్యమకారులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జగిత్యాలలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ సభలో సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీలో చేరారు. ఈ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా తప్పుబట్టారు. 75 ఏళ్ల కురువృద్ధుడిని పార్టీలో చేర్చుకుని, ఆయనకు 25 ఏళ్లు తగ్గిపోయాయని, నవ యువకుడిగా అద్భుతాలు చేస్తారని కేసీఆర్ పొగడటం హాస్యాస్పదమన్నారు. అలాంటప్పుడు రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఏమవ్వాలని ఆమె ప్రశ్నించారు. యువత ఆకాంక్షలను గుర్తించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అయిన జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని, తెలంగాణ పునర్నిర్మాణం గురించి మాట్లాడటం దారుణమన్నారు.

బీఆర్ఎస్ పార్టీ ఉట్టి కథలు చెబుతుంటే, అధికార కాంగ్రెస్ పార్టీ పిట్ట కథలు చెబుతోందని, కానీ ఏ ఒక్కరూ ప్రజల కష్టాల గురించి మాట్లాడటం లేదని కవిత విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజలు తప్పు చేశారని కేసీఆర్ అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సింది పోయి వారిని తప్పుబట్టడం సరికాదన్నారు. బీఆర్ఎస్ సభలో బీజేపీని పల్లెత్తు మాట అనలేదని, మహిళా రిజర్వేషన్ల ఊసే ఎత్తలేదని ఆమె మండిపడ్డారు. రాజకీయ పునరేకీకరణ పేరుతో ఆ పార్టీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోందని దుయ్యబట్టారు.

కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటు విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు సహకరించాలని, అడ్డంకులు సృష్టించవద్దని కవిత కోరారు. ప్రజాస్వామ్యంలో కొత్త శక్తులు ఎదిగేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో తమ సమస్యల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు కవిత తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రజల గొంతుకగా నిలిచేందుకే తాను నూతన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
KCR
BRS Jagtial Sabha

More Telugu News