హైదరాబాద్ చాలా సేఫ్.. రాత్రిపూట ఒంటరిగా నడిచా.. యువతి వీడియో వైరల్!

  • హైదరాబాద్‌లో రాత్రిపూట ఒంటరిగా నడిచానన్న యువతి
  • నగరంలో మహిళలకు పూర్తి భద్రత ఉందని ప్రశంస
  • ఉద్యోగం కోసం వచ్చి, నగరం చూసి ఫిదా అయ్యానన్న యువతి
  • తొలుత ముంబైలో స్థిరపడాలనుకున్నానని వెల్లడి
  • యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల స్పందన
హైదరాబాద్ నగరంలో మహిళల భద్రతపై ఓ యువతి పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. లీషా అనే యువతి రాత్రిపూట నగరంలో ఒంటరిగా నడిచిన తన అనుభవాన్ని వివరిస్తూ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. భాగ్యనగరం మహిళలకు అత్యంత సురక్షితమైన నగరమని ఆమె తన వీడియోలో కొనియాడింది.

ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన లీషా, ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో తన ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ... "రాత్రిపూట ఒంటరిగా దాదాపు నాలుగు కిలోమీటర్లు నడిచాను. ఈ సమయంలో నాకు ఎలాంటి వేధింపులు, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు ఎదురుకాలేదు. ఎంతో సురక్షితంగా అనిపించింది" అని ఆమె తెలిపారు. హైదరాబాద్ రాకముందు, ముంబైలో స్థిరపడాలని కలలు కన్నానని, హైదరాబాద్‌ను ఒక పాత నగరంగానే భావించానని ఆమె పేర్కొన్నారు.

అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా వివరించారు. "హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉంది. ఇక్కడి మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారు. పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది" అని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. చాలామంది ఆమె మాటలతో ఏకీభవించారు. "నేను కూడా ఇటీవలే హైదరాబాద్ వచ్చాను, మీరు చెప్పింది నిజం" అని ఒకరు కామెంట్ చేయగా, "ఒక్కసారి హైదరాబాద్ వస్తే, మళ్లీ వదిలి వెళ్లలేరు" అని మరొకరు రాశారు. చాలా మంది హైదరాబాద్‌ను "అద్భుతమైన నగరం" అంటూ ఆమె అభిప్రాయాన్ని సమర్థించారు.

Viral Video
Hyderabad
Late Night Walk Experience

More Telugu News