మహిళా ఆఫీసర్ కు బాదం పప్పుల గిఫ్ట్.. ఛత్తీస్ గఢ్​ లో ఓ పౌరుడి వినూత్న నిరసన.. వీడియో ఇదిగో!

Chhattisgarh Man Gifts Almonds to Officer as Protest
  • బాదం తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందంటూ చురక
  • అధికారుల నిర్లక్ష్యంపై వినూత్నంగా ప్రశ్నించిన వ్యక్తి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు ఆలస్యం కావడం, అధికారులు ఫైళ్లు కనిపించడం లేదని చెప్పడం సాధారణం. కానీ, ఛత్తీస్ గఢ్ లోని భిలాస్ పూర్ లో ఓ వ్యక్తి దీనిపై వినూత్నంగా నిరసన వ్యక్తం చేశాడు. తన ఫైల్ గురించి పదేపదే మర్చిపోతున్నానన్న ఓ మహిళా అధికారిణికి బాదం పప్పుల ప్యాకెట్ ఇచ్చి షాకిచ్చాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ లోని భిలాస్ పూర్ జిల్లా హౌజింగ్ బోర్డ్ కార్యాలయంలో తాను పెట్టుకున్న దరఖాస్తుకు అధికారులు ఆమోదం తెలపడంలేదంటూ ఓ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆఫీసులోని మహిళా అధికారి తనను ఏడాదిగా తిప్పించుకుంటోందని ఆరోపించాడు. ఎప్పుడు వెళ్లినా తన ఫైల్ కనిపించడంలేదని, ఎక్కడ పెట్టానో గుర్తులేదని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాదాపు ఏడాదిగా ఆఫీసు చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయానని చెబుతూ.. తాజాగా ఓ బాదం పప్పుల ప్యాకెట్ తీసుకొచ్చి సదరు మహిళా అధికారి టేబుల్ పై కుమ్మరించాడు.

‘‘మేడం.. ఈ బాదం పప్పులు తినండి. ఇవి మీ మెదడును షార్ప్ చేసి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. అప్పుడు నా ఫైల్ ఎక్కడ పెట్టారో గుర్తుకు వస్తుంది. ఆ తర్వాతైనా నా పని చేసిపెట్టండి” అంటూ అధికారికి తన నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన మొత్తాన్నీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వ్యక్తి చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. "ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి ఇంతకంటే మంచి ట్రీట్‌మెంట్ లేదు" అని కొందరు, "గాంధేయమార్గంలో అద్భుతమైన నిరసన" అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Go Back to Shorts
Chhattisgarh
Bhilaspur
Housing Board
File Approval
Government Office
Protest
Almonds
Viral Video
Social Media

More Telugu News