తండ్రయిన ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్

  • కొడుకుకు 'అజ్లాన్' అని పేరు పెట్టినట్టు రషీద్ ఖాన్ ప్రకటన
  • సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఆనందం పంచుకున్న వైనం
  • గుజరాత్ టైటాన్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించిన స్పిన్ లెజెండ్
ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. అతడు తండ్రయ్యాడు. ఈ సంతోషకరమైన వార్తను రషీద్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తమకు పండంటి మగబిడ్డ పుట్టాడని, ఆ చిన్నారికి 'అజ్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్టు వెల్లడించాడు.

"అల్హమ్దులిల్లా. ఈ ప్రపంచంలోకి నా చిన్నారి యువరాజుకు స్వాగతం" అంటూ రషీద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ చేశాడు. తన కుటుంబాన్ని ప్రార్థనలలో గుర్తుంచుకోవాలని కోరాడు. "హలో వరల్డ్, మై నేమ్ ఈజ్ అజ్లాన్ ఖాన్" అని రాసి ఉన్న ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్‌తో పలువురు క్రికెటర్లు, అభిమానులు రషీద్ ఖాన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వ్యక్తిగతంగా ఇంతటి ఆనందంలో ఉన్నప్పటికీ, రషీద్ ఖాన్ తన వృత్తిపరమైన బాధ్యతలను విస్మరించలేదు. శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతుల్లో 79 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న కామెరూన్ గ్రీన్‌ను ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ చేసి రషీద్ తన సత్తా చాటాడు. దీంతో కేకేఆర్ 180 పరుగులకే పరిమితమైంది.

అనంతరం ఛేదనలో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 86 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, జోస్ బట్లర్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీంతో గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

Rashid Khan
Baby Boy
Azlan Khan
Afghanistan
Cricket

More Telugu News