రష్యా చమురు కొనుగోలుపై అమెరికా యూటర్న్... భారత్ సహా వివిధ దేశాలకు ఊరట

  • రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షల సడలింపు
  • మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తింపు
  • సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలుకు అనుమతి
ప్రపంచ దేశాలకు చమురు విషయంలో అమెరికా ఊరట కల్పించింది. హర్మూజ్ జలసంధిని ఇరాన్ మరోసారి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ఆందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేలా అమెరికా ఆంక్షలను సడలించింది. ఇది భారతదేశం సహా వివిధ దేశాలకు భారీ ఊరట కలిగించే విషయం. ఇటీవలే ఇరాన్ యుద్ధం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా, కొన్నిరోజులకే మళ్లీ ఆంక్షలను విధించింది.

ప్రస్తుతం ఇరాన్‌ మళ్లీ హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో చమురు ధరల స్థిరీకరణ కోసం అమెరికా రష్యా చమురుపై ఆంక్షలను సడలించింది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్ ఆదేశాలు జారీ చేసింది. మే 16వ తేదీ వరకు ఆంక్షల సడలింపు వర్తిస్తుందని తెలిపింది.

అయితే రష్యా నుంచి కొత్తగా చమురు కొనుగోలుపై కాకుండా, సముద్ర మార్గంలో రవాణాలో ఉన్న చమురు కొనుగోలు చేయడానికి అమెరికా అనుమతివ్వడం గమనార్హం. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేసిన నేపథ్యంలో భారత్ గతంలో కంటే మూడు రెట్ల చమురును కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న రెండో దేశం భారత్.

సముద్రమార్గంలో ఉన్న రష్యా చమురును కొనుగోలు చేయడానికి మినహాయింపు లేదని అమెరికా ఆర్థికమంత్రి రెండు రోజుల క్రితం ప్రకటించారు. అయితే అంతలోనే మాట మార్చి, మినహాయింపును దాదాపు నెల రోజులు పొడిగించడం గమనార్హం. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోలుకు వివిధ దేశాలు ఒత్తిడి తెచ్చినందువల్లే అమెరికా యూటర్న్ తీసుకుందని భావిస్తున్నారు.

Russia oil
US oil
America
India oil imports
Hormuz Strait
Iran
oil prices
oil sanctions
crude oil

More Telugu News