ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
  • కిడ్నీ రోగులకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు
  • పీపీపీ పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌లో నిర్వహణ
  • మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత
తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. మారుమూల ప్రాంతాల్లోని రోగులు డయాలసిస్ కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కొత్త కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌లో నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులు ప్రధాన హబ్‌లుగా వ్యవహరిస్తూ, మిగిలిన కేంద్రాలకు సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తాయి. కొత్త కేంద్రాలతో పాటు ఇప్పటికే ఉన్న 67 డయాలసిస్ సెంటర్లలో అదనంగా 155 యంత్రాలను ఏర్పాటు చేసి పడకల సామర్థ్యాన్ని కూడా పెంచనున్నారు.

ప్రతి 25 కిలోమీటర్ల పరిధిలోను ఒక డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యంగా ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్ వంటి ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త కేంద్రాల ద్వారా మొత్తం 416 పడకలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో 5 నుంచి 10 డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ నిర్ణయంతో కిడ్నీ రోగులు చికిత్స కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. అత్యవసర సమయాల్లోనూ వేగంగా వైద్యం అందే అవకాశం కలుగుతుంది. ఈ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Telangana Government
Telangana dialysis centers
kidney disease
dialysis centers
healthcare Telangana
NIMS Hyderabad
Osmania Hospital
dialysis access
rural healthcare
health infrastructure

More Telugu News