తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు శుభవార్త.. రెండు కొత్త రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ

New weekly express trains announced for Andhra and Telangana
  • చర్లపల్లి-నర్సాపురం, నర్సాపురం-తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
  • ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చిన రైల్వే శాఖ
  • ఇండోర్-లింగంపల్లి-ఇండోర్ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకు పొడిగింపు
  • వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మారిన కాకినాడ ఎక్స్‌ప్రెస్
  • ఏప్రిల్ చివరి వారం నుంచే అమల్లోకి రానున్న కొత్త రైళ్లు, మార్పులు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త వారపు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించడంతో పాటు మరికొన్ని రైళ్ల సేవలను పొడిగించింది.

దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వివరాల ప్రకారం చర్లపల్లి-నర్సాపురం-చర్లపల్లి (17061/17062) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కొత్తగా ప్రకటించారు. ఇది ఇప్పటివరకు నడుస్తున్న ప్రత్యేక రైలు స్థానంలో రెగ్యులర్ సర్వీసుగా నడుస్తుంది. మే 2 నుంచి ప్రతి శనివారం రాత్రి 7:50 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఈ రైలు నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.

అలాగే, నర్సాపురం-తిరుపతి-నర్సాపురం (17428/17427) మధ్య మరో వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 27 నుంచి ప్రతి సోమవారం సాయంత్రం 3:50 గంటలకు నర్సాపురంలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3:40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మే 3 నుంచి ప్రతి ఆదివారం రాత్రి 10:10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:30 గంటలకు నర్సాపురం చేరుకుంటుంది. ఈ రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.

ఇతర రైళ్ల సేవల్లో మార్పులు
వీటితో పాటు రైల్వే బోర్డు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇండోర్-లింగంపల్లి-హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (20916/20915) చర్లపల్లి వరకు పొడిగించారు. ఈ మార్పు ఏప్రిల్ 25 నుంచి అమల్లోకి వస్తుంది.

కాకినాడ టౌన్-లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌ను (12775/12776) వారానికి మూడు రోజుల నుంచి రోజువారీ సర్వీసుగా మార్చారు. ఈ రైలుకు సామర్లకోటలో అదనపు హాల్ట్‌ను కూడా కేటాయించారు. ఈ మార్పులు ఏప్రిల్ 21 నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రైళ్లు, మార్పులతో తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది.
Go Back to Shorts
Indian Railways
Andhra Pradesh
Telangana
New Trains
Narsapur
Charlapalli
Tirupati
Train Services
South Central Railway
Weekly Express

More Telugu News