ఏడేళ్లకే స్టేజ్‌పై వయోలిన్ వాయించా.. పవన్ నాకోసం పియానో కొనిచ్చారు: ఆసక్తికర విషయాలు చెప్పిన అన్నా కొణిదెల

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అర్ధాంగి, శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన అన్నా కొణిదెల తన జీవితంలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ చేశారు. సంగీతం తన జీవితంలో ఎలా అంతర్భాగంగా ఉండేదో వివ‌రిస్తూ ఆమె పంచుకున్న జ్ఞాపకాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

తన చిన్ననాటి ఫొటోను షేర్ చేస్తూ అన్నా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. "ఈ ఫొటోలో ఉన్నది ఏడేళ్ల వయసులో ఉన్న నేనే. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో నా మ్యూజిక్ స్కూల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పెద్ద వేదికపై నిల్చున్నాను. నా చేతులు ఇంకా చాలా చిన్నవి. అప్పుడు లూడ్విగ్ వాన్ బీథోవెన్ స్వరపరిచిన 'లా మర్మోట్' వాయించాను. నా టీచర్ పియానో వద్ద నా పక్కనే కూర్చుని నాకు సహకారం అందించారు. ఆ తర్వాత మూడేళ్లకు నేను పియానో వాయించడం కూడా ప్రారంభించాను" అని అన్నా వివరించారు.

తన సంగీత ప్రయాణం గురించి ఆమె మరింత వివ‌రంగా తెలియ‌జేస్తూ... "నేను ఐదేళ్ల వయసు నుంచే వయోలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సాధారణ చదువుతో పాటు పదిహేనేళ్ల వయసులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేంత వరకు మ్యూజిక్ స్కూల్‌కు వెళ్లాను. నేను వృత్తిపరంగా సంగీతంలో ముందుకు వెళ్లకపోయినా, శాస్త్రీయ సంగీతం ఎల్లప్పుడూ నాలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది" అని పేర్కొన్నారు.

భారతదేశానికి వచ్చిన తర్వాత తన భర్త పవన్ కల్యాణ్ తనకు ఒక పియానో కొనిచ్చారని అన్నా వెల్లడించారు. "నా వయోలిన్ కూడా ఇక్కడే ఉంది. కానీ, ఈ మధ్య కాలంలో వాటిని వాయించాలని అనిపించడం లేదు. నాలోని సంగీతం సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంది. బహుశా మళ్లీ వినిపించడానికి అది వేచి చూస్తుందేమో" అని తన మనసులోని మాటను పంచుకున్నారు.

సంగీతం గొప్పతనాన్ని వివరిస్తూ... "సంగీతం భాష, నేపథ్యాలకు అతీతంగా ప్రజలను కలుపుతుంది. ఒక్క మాట కూడా లేకుండానే మనం నొప్పి, ప్రేమ, ఆనందాన్ని దాని ద్వారా అనుభూతి చెందగలం. ఇది సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య, ఖండాల మధ్య ఒక వారధి" అని అన్నా తన పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవలే అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. గత నెలలో పవన్ కల్యాణ్ తన భార్యకు సోషల్ మీడియాలోకి సాదర స్వాగతం పలుకుతూ, ఆమె ఉనికి స్ఫూర్తిదాయకమైన చర్చలకు దారితీయాలని ఆకాంక్షించారు. ఇప్పుడు అన్నా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువవుతున్నారు.

Anna Konidela
Pawan Kalyan
Anna Konidela Pawan Kalyan
violin
piano
classical music
Saint Petersburg
Ludwig van Beethoven
music school
Andhra Pradesh Deputy CM

More Telugu News