ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే... ఏపీలో నవశకం ప్రారంభం

భారత క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో రెండు కీలక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. గన్నవరంలోని మేధా టవర్స్, రాజధానిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టంతో, దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో భాగంగా వస్తున్న ఈ కేంద్రాలతో రాష్ట్రంలో నూతన సాంకేతిక శకానికి నాంది పడనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 1ఎస్, 1క్యూ పేర్లతో రెండు వేర్వేరు క్వాంటం టెస్టింగ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఆవిష్కరించనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే అత్యంత కీలకమైన సామర్థ్యం అమరావతి క్వాంటం వ్యాలీకి లభిస్తుంది. మేధాటవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మరో కేంద్రం ఏర్పాటవుతోంది. 

మైనస్ 273 డిగ్రీల సెంటీగ్రేడ్ అతిశీతల ఉష్ణోగ్రతలో పనిచేసే ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు, క్వాంటం ఉపకరణాల తయారీ, పరిశోధనలలో కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటీని 'ఓపెన్ యాక్సెస్' పద్ధతిలో అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల క్వాంటం ఉపకరణాలు తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

ఈ రెండు క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలలో పూర్తిగా స్వదేశంలో తయారైన ఉపకరణాలనే వినియోగించడం విశేషం. మేధా టవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ '1క్యూ' పేరుతో టెస్ట్ బెడ్‌ను ఏర్పాటు చేయగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో '1ఎస్' పేరుతో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరో టెస్ట్ బెడ్‌ను నిర్మించారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), డీఆర్డీవో వంటి దేశంలోని అగ్రశ్రేణి సంస్థలు పూర్తి సహకారం అందించాయి.

ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ అధికారులు, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగంలో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది రాష్ట్ర యువతలో సాంకేతిక విద్య పట్ల ఆసక్తిని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Quantum Technology
Quantum Computing
Amaravati Quantum Valley
Quantum Testbeds
SRM University
Qubitec
Megha Towers
National Quantum Mission

More Telugu News