బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతోందా?.. ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు

బీఆర్‌ఎస్ పార్టీ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌ (తెలంగాణ రాష్ట్ర సమితి)గా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో జరిగిన ఓ కార్యక్రమం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని పొరపాట్లు చేసిందని కేటీఆర్ అంగీకరించారు. ఈ తప్పుల కారణంగా ప్రజలకు, పార్టీ నాయకులకు మధ్య కొంత దూరం పెరిగిందని, దీనిపై తాము పూర్తిస్థాయిలో అధ్యయనం చేశామని తెలిపారు. గుర్తించిన లోపాలను సరిదిద్దుకుని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

"చంద్రుడిపై కొన్ని మబ్బులు కమ్మినంత మాత్రాన చంద్రుడు కనుమరుగు కాడు. ఆ మబ్బులు తొలగి మళ్లీ ప్రకాశిస్తాడు. బీఆర్‌ఎస్ కూడా తాత్కాలికంగా వెనుకబడ్డా తిరిగి పుంజుకుని అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు" అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 179కి, పార్లమెంట్ స్థానాలు 28కి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, మేధావులు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రులుగా నిలిచారని ప్రస్తావించారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ పేరు మార్పు ఆలోచన, భవిష్యత్ వ్యూహాలపై విశ్లేషణలు మొదలయ్యాయి.

KTR
BRS party
TRS party
Telangana politics
KCR
Assembly elections
Telangana Rashtra Samithi
Political alliances
Telangana government
Indian politics

More Telugu News