బటన్ నొక్కితే కారు నంబర్ ప్లేట్ చేంజ్.. వీడియో ఇదిగో!

ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని వేసిన హైటెక్ ప్లాన్ బెడిసికొట్టింది. బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో నంబర్ ప్లేట్ మారిపోయేలా ఏర్పాటు చేసుకున్న అతడి ప్లాన్‌ను జూబ్లీహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు బట్టబయలు చేశాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1 వద్ద పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అటుగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారును పోలీసులు ఆపారు. ఆ కారును నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించినట్లు బ్రీత్ అనలైజర్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. అయితే, వాహనదారుడు వివరాలు చెప్పడానికి నిరాకరించడంతో ఓ కానిస్టేబుల్ కారును పక్కకు తీసేందుకు లోపలికి వెళ్లారు. ఆ సమయంలో స్టీరింగ్ పక్కన ఉన్న ఓ బటన్‌ను పొరపాటున నొక్కడంతో అసలు గుట్టు రట్టయింది.

కారు ముందు భాగంలో ఉన్న నంబర్ ప్లేట్ ఒక్కసారిగా తిరగడంతో పోలీసులు అవాక్కయ్యారు. తనిఖీ చేయగా, కారు ముందు వైపు ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ‘DL 6 CM 7079’ అని, వెనుక వైపు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ‘TS 9 FQ 9999’ నంబర్ ఉన్నట్లు గుర్తించారు. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్ వంటి సమయాల్లో సీసీటీవీ కెమెరాల నుంచి, చలాన్ల నుంచి తప్పించుకోవడానికే ఈ టెక్నాలజీని వాడినట్లు గౌతమ్ విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు వెంటనే కారును సీజ్ చేశారు. వాహనదారుడిపై డ్రంకెన్ డ్రైవ్‌తో పాటు ఫోర్జరీ, మోసం కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ టెక్నాలజీని అతనికి ఎవరు అమర్చారనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.

Car Number Plate
Drunken Drive
Traffic Challan
BMW Car
Delhi Registration
Telangana Registration
Flipping Number Plate

More Telugu News