సంజు శాంసన్ శతకం.. ఓవర్టన్ జోరు.. బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్

Sanju Samson Century Chennai Super Kings Win Over Delhi Capitals
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపీఎల్ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో సంజు శాంసన్ (115 నాటౌట్) అద్భుత శతకంతో కదం తొక్కగా, బౌలింగ్‌లో జేమీ ఓవర్టన్ (4/18) మాయ చేశాడు. ఈ విజయంతో చెపాక్ స్టేడియంలో వరుసగా ఆరు ఓటముల పరంపరకు చెన్నై తెరదించింది.

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత టీ20 ప్రపంచకప్ హీరో సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 56 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 115 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. సీఎస్‌కే తరఫున సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు రికార్డు సృష్టించాడు. యువ ఆటగాడు ఆయుష్ మాత్రే (36 బంతుల్లో 59) కూడా అద్భుత హాఫ్ సెంచరీతో రాణించాడు. వీరిద్దరూ కలిసి 113 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో శివమ్ దూబే (10 బంతుల్లో 20) వేగంగా ఆడి స్కోరును 210 దాటించాడు.

భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు పాథుమ్ నిస్సంక (41), కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. అయితే, కీలక దశలో చెన్నై బౌలర్లు పుంజుకోవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా కుప్పకూలింది. ముఖ్యంగా జేమీ ఓవర్టన్ తన పదునైన బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ మిడిలార్డర్‌ను దెబ్బతీశాడు. అరంగేట్ర బౌలర్ గుర్జప్‌నీత్ సింగ్, అన్షుల్ కంబోజ్ (3/35) కూడా రాణించారు.

ఒక దశలో ట్రిస్టన్ స్టబ్స్ (38 బంతుల్లో 60) ఒంటరి పోరాటం చేసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, పెరిగిపోతున్న రన్ రేట్ ఒత్తిడికి తలొగ్గి అతను కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌట్ అయి ఓటమిపాలైంది.
Go Back to Shorts
CSK vs DC
Sanju Samson
Sanju Samson century
Chennai Super Kings
Jamie Overton
IPL 2024
Chepauk Stadium
Delhi Capitals
Ayush Matre
T20 World Cup

More Telugu News