పుణేలో అనూహ్య ఘటన.. హెలిప్యాడ్ బదులు పార్కింగ్ స్థలంలో ల్యాండ్ అయిన మంత్రి హెలికాప్టర్

Major Mishap Averted As Helicopter Carrying Maharashtra Minister Chhagan Bhujbal Misses Helipad Lands In Parking Lot
మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పుణే జిల్లాలో ఈరోజు ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా నిర్దేశించిన హెలిప్యాడ్‌లో కాకుండా దానికి సమీపంలో ఉన్న ఓ పార్కింగ్ స్థలంలో హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్వల్ప గందరగోళం నెలకొంది. అయితే, ఈ ఘటనలో మంత్రి సహా పైలట్‌కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే..! 
పురందర్ తాలూకాలోని ఖన్‌వాడి గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ స్థానిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు మంత్రి భుజ్‌బల్ హెలికాప్టర్‌లో బయలుదేరారు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న చివరి క్షణాల్లో దాని రెక్కల గాలికి పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి పైకి లేచాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో 'బ్రౌనౌట్' ఎఫెక్ట్ అంటారు. ఈ కారణంగా పైలట్ కు హెలిప్యాడ్ కనిపించలేదు. దాంతో, హెలిప్యాడ్ పక్కనే ఉన్న వాహనాల పార్కింగ్ స్థలంలో ఖాళీగా ఉండడంతో అక్కడ హెలికాప్టర్‌ను ల్యాండ్ చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో హెలికాప్టర్ హెలిప్యాడ్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో సురక్షితంగా దిగుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పొరపాటున ల్యాండింగ్ జరిగిందని గ్రహించిన స్థానిక పోలీస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత హెలికాప్టర్‌ను తిరిగి సరైన హెలిప్యాడ్‌కు తరలించారు.

ముఖ్యంగా దుమ్ము ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో హెలికాప్టర్ ఆపరేషన్ల సమయంలో 'బ్రౌనౌట్' అనేది ఒక సాధారణ సవాల్ అని నిపుణులు చెబుతున్నారు. ల్యాండింగ్ సమయంలో పైలట్‌ను ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ స్వల్ప అంతరాయం తర్వాత మంత్రి భుజ్‌బల్ తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకు ఎటువంటి విచారణకు ఆదేశించలేదని తెలుస్తోంది.
Go Back to Shorts
Viral Video
Chhagan Bhujbal
Maharashtra Minister
Pune
Helicopter Landing
Brownout Effect
Purandar
Khanwadi
Helipad
Parking Area

More Telugu News