ఢిల్లీలో పెట్రోల్ టూ-వీలర్లకు చెక్.. 2028 నుంచి రిజిస్ట్రేషన్ల బంద్!

Delhi Government to Ban Petrol Two Wheeler Registrations From 2028
షార్ట్స్‌లో చూడండి
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరులో భాగంగా బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నగరంలో పెట్రోల్ టూ-వీలర్ల వినియోగాన్ని దశలవారీగా తగ్గించే లక్ష్యంతో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీ ముసాయిదాను శనివారం విడుదల చేసింది. ఈ ముసాయిదా ప్రకారం.. 2028 ఏప్రిల్ 1 నుంచి దేశ రాజధానిలో కొత్త పెట్రోల్ టూ-వీలర్ల (బైకులు, స్కూటర్లు) రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయనున్నారు. అంతకంటే ముందుగానే, 2027 జనవరి 1 నుంచే కొత్త పెట్రోల్ లేదా సీఎన్‌జీ ఆటో రిక్షాల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించనున్నారు. 2030 నాటికి ఢిల్లీని పూర్తిస్థాయి ఈవీ నగరంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు.

ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటించింది. మొదటి ఏడాదిలో ఈవీ టూ-వీలర్ కొనుగోలు చేసేవారికి రూ.30,000 వరకు సబ్సిడీ, రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వనున్నారు. అలాగే, పాత పెట్రోల్ వాహనాన్ని తుక్కుగా మార్చి కొత్త ఈవీ కొంటే అదనంగా రూ.10,000 ప్రోత్సాహకం అందిస్తారు. ప్రతి ఈవీ డీలర్ వద్ద పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ తప్పనిసరి చేయడంతో పాటు, ఇళ్ల వద్ద ఛార్జింగ్ పాయింట్ల కోసం సింగిల్ విండో విధానం తీసుకురానున్నారు.

ప్రస్తుతం ఇది ముసాయిదా దశలోనే ఉంది. ఈ పాలసీపై ప్రజల నుంచి అభిప్రాయాలను 2026 మే 1 వరకు స్వీకరించి, ఆ తర్వాత ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఢిల్లీలో శీతాకాలంలో పెరిగే వాయు కాలుష్యానికి వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు 23 శాతం కారణమవుతున్నాయని అంచనా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Go Back to Shorts
Delhi Government
Delhi
Electric Vehicles
EV Policy
Air Pollution
CNG Auto Rickshaws
Petrol Two Wheelers
Vehicle Registration Ban

More Telugu News