పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో!

దేశ రాజకీయాల్లో ఉప్పు- నిప్పులా ఉండే ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఒకరినొకరు పలకరించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతిని పురస్కరించుకుని పార్లమెంట్ లోని ‘ప్రేరణ స్థల్’ వద్ద ఏర్పాటు చేసిన నివాళి కార్యక్రమంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పూలే విగ్రహానికి నివాళులర్పించగా... అనంతరం ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.


ఈ క్రమంలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకోగానే సమయానికే రాహుల్ గాంధీ అక్కడకు చేరుకున్నారు. వాహనం దిగి వచ్చిన మోదీకి రాహుల్ మర్యాదపూర్వంగా నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కాసేపు పలు విషయాలపై ముచ్చటించుకున్నారు. ప్రధాని ఏదో అడుగుతుండగా రాహుల్ దానికి సమాధానం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 


ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ వాగ్యుద్ధం నడుస్తున్న తరుణంలో, పార్లమెంట్ సాక్షిగా ఇద్దరు అగ్రనేతలు ఇలా సౌహార్దపూర్వక వాతావరణంలో మాట్లాడుకోవడం విశేషం. సభలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నప్పటికీ, దేశం గర్వించదగ్గ మహాత్ముని జయంతి వేడుకల్లో రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలిసి కనిపించడం ప్రశంసనీయం.


Rahul Gandhi
Narendra Modi
Indian Parliament
Jyotiba Phule
Droupadi Murmu
Om Birla
India Politics
Lok Sabha
BJP
Congress

More Telugu News