వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే!

Warangal Man Arrested for Murdering Wife and Daughters
షార్ట్స్‌లో చూడండి
వరంగల్ శివారు ప్రాంతంలో మూడు నెలల గర్భిణి, ఆమె ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో పోలీసులు మిస్టరీని ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది భర్తేనని తేల్చారు. ప్రధాన నిందితుడైన భర్త మహ్మద్ అజారుద్దీన్‌తో పాటు, అతడికి సహకరించిన మరో 9 మందిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు అజారుద్దీన్ తన భార్య ఫర్హానా (26)కు అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాడు. ఆమె గర్భంలో ఉన్నది ఆడశిశువని తెలియడంతో ఆమెను, ఇద్దరు కుమార్తెలను (9, 5 ఏళ్లు) హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. మగపిల్లాడి కోసం ఓ బాలికను వివాహం చేసుకోవాలని నిందితుడు భావించినట్లు, ఈ క్రమంలోనే భార్య, పిల్లల అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ నేరంలో అజారుద్దీన్‌కు అతడి తల్లిదండ్రులు, సోదరుడు సహకరించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడానికి సాయపడిన మెడికల్ షాపు యజమాని, ఆర్‌ఎంపీ, ల్యాబ్ టెక్నీషియన్, నర్సు సహా మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న ఇద్దరు గైనకాలజిస్టులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఏప్రిల్ 1న చిన్న కుమార్తె పుట్టినరోజు వేడుకల పేరుతో అజారుద్దీన్ తన భార్యాపిల్లలను పున్నేలు గ్రామ శివారులోని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు. అక్కడ సీసీటీవీ కెమెరాలను, విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ముగ్గురినీ స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఫర్హానా తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

విచారణలో అజారుద్దీన్ నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై హత్య, సాక్ష్యాల ధ్వంసం వంటి సెక్షన్లతో పాటు, మైనర్‌ను పెళ్లి చేసుకోవాలని వేధించినందుకు పోక్సో చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు. మిగతా నిందితులపై లింగ నిర్ధారణకు సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Mohammad Azharuddin
Warangal
Farhana
farmhouse murder
gender determination test
infanticide
swimming pool death
Telangana crime
honour killing
POCSO Act

More Telugu News