భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం!

Bhogapuram Airport inauguration AP government invites PM Modi
షార్ట్స్‌లో చూడండి

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారవుతోంది. ఈ మెగా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి అధికారికంగా ఆహ్వానం పంపారు. ప్రధాని షెడ్యూల్ లభ్యతను బట్టి జూలై 5 లేదా 8వ తేదీల్లో ఒక రోజును, లేనిపక్షంలో ఆగస్టు 17 లేదా 19 తేదీల్లో మరొక తేదీని ప్రారంభోత్సవానికి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.


ప్రస్తుతం ఈ విమానాశ్రయ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 98 శాతం పనులు ఇప్పటికే పూర్తవ్వగా, మిగిలిన ఫినిషింగ్ పనులను జూన్ 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అదనపు సిబ్బందిని మోహరించి రాత్రింబవళ్లు యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు. 


ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోవడమే కాకుండా... పర్యాటక, పారిశ్రామిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ విమానాశ్రయాన్ని కస్టమ్స్ ఎయిర్‌పోర్ట్‌గా కేంద్రం నోటిఫై చేయగా, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ హోదాను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.

Go Back to Shorts
Chandrababu Naidu
Bhogapuram Airport
Andhra Pradesh
Narendra Modi
Uttarandhra
International Airport
Airport Inauguration
Tourism
Infrastructure Development

More Telugu News