లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 250 మంది మృతి

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్.. లెబనాన్‌పై భీకర వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 250 మందికి పైగా మరణించగా, 1100 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిణామంతో కాల్పుల విరమణ ఒప్పందం భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కాల్పుల విరమణను ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. అయితే, ఈ ఒప్పందం ప్రకటించిన వెంటనే ఇజ్రాయెల్.. లెబనాన్‌లోని బీరుట్, బెకా లోయ సహా హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది. అమెరికాతో కుదిరిన ఒప్పందం తమకు, హిజ్బుల్లాకు మధ్య జరుగుతున్న పోరాటానికి వర్తించదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా లెబనాన్‌లో జరుగుతున్నది ఒక "ప్రత్యేక ఘర్షణ" అని వ్యాఖ్యానించారు.

ఈ దాడులను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఒప్పందం కుదిరిన గంటల వ్యవధిలోనే ఇంతటి మారణహోమం జరగడం నమ్మశక్యంగా లేదని యూఎన్ మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. "ఇజ్రాయెల్-అమెరికా దురాక్రమణ ఆగే వరకు తమ ప్రతిదాడులు కొనసాగుతాయి" అని హిజ్బుల్లా హెచ్చరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌లో జరగాల్సిన తదుపరి చర్చలు అత్యంత కీలకంగా మారాయి. కాల్పుల విరమణ వార్తతో 95 డాలర్ల దిగువకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర, లెబనాన్ దాడులతో మళ్లీ 97 డాలర్లకు పెరిగింది.

Israel
Lebanon
Israel Lebanon conflict
Hezbollah
Benjamin Netanyahu
Donald Trump
Middle East tensions
Beirut
Volker Turk
UN

More Telugu News