గత్యంతరం లేకే అమెరికా దిగొచ్చింది: భారత్‌లో ఇరాన్ రాయబారి

America forced ceasefire says Abdul Majid Hakim Elahi
షార్ట్స్‌లో చూడండి
యుద్ధాన్ని కొనసాగించలేక, మరిన్ని నష్టాలు తప్పవని గ్రహించే అమెరికా కాల్పుల విరమణ ప్రకటించిందని భారత్‌లోని ఇరాన్ సుప్రీం లీడర్ ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికా స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయం కాదని, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయానికి వచ్చిందని బుధవారం ఆయన స్పష్టం చేశారు.

"యుద్ధాన్ని కొనసాగించే శక్తి లేకపోవడంతో అమెరికా కాల్పుల విరమణ ప్రకటించాల్సి వచ్చింది. వారు ఒక పెద్ద తప్పు చేశారు. గత 41 రోజులుగా యుద్ధాన్ని ఆపాలని ప్రయత్నించినా వారి వల్ల కాలేదు. చివరికి, ఓటమి తప్పదని గ్రహించి దాడుల విరమణకు ముందుకొచ్చారు" అని హకీమ్ ఇలాహీ తెలిపారు. శాశ్వత శాంతి నెలకొనాలంటే తమ షరతులను అమెరికా అంగీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

తమ దేశం ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని, తమపై బలవంతంగా రుద్దారని ఇలాహీ అన్నారు. ఈ ఘర్షణలో అమాయక ప్రజలు ఇబ్బంది పడటం తమకు ఇష్టం లేదని, ఎప్పుడూ అంతర్జాతీయ నిబంధనలు, మానవత్వాన్నే పాటించామని ఆయన వివరించారు. అయితే, దాడులు కొనసాగితే గట్టిగా బదులిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా గ్రహించిందని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. "అది అబద్ధం. అణ్వాయుధాలు మా మత విశ్వాసాల ప్రకారం 'హరాం' (నిషిద్ధం) అని మా సుప్రీం లీడర్ స్పష్టంగా చెప్పారు. మాకు అవి ఎప్పటికీ వద్దు" అని ఆయన తేల్చిచెప్పారు. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలకు వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన అమెరికా జోక్యమే కారణమని, తాము పొరుగు దేశాలపై కాకుండా వారి భూభాగంలోని అమెరికా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు.
Go Back to Shorts
Abdul Majid Hakim Elahi
Iran
America
US ceasefire
Iran nuclear program
Gulf tensions
India Iran relations
Iran ambassador
Middle East conflict
War

More Telugu News