యుద్ధ భయాలకు బ్రేక్... బుల్లెట్‌లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

Indian Stock Market Rallies Amid Geopolitical Calm
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు తొలగిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2,775 పాయింట్లు (3.71 శాతం) ఎగబాకి 77,392 వద్ద ఇంట్రా-డే గరిష్టాన్ని తాకింది. అదేవిధంగా, నిఫ్టీ 815 పాయింట్లు (3.52 శాతం) పెరిగి 23,938 వద్ద ట్రేడ్ అయింది.

ఈ సానుకూల వాతావరణంతో అన్ని రంగాల షేర్లు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. రియల్ ఎస్టేట్, ఆటో, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు 6 శాతం వరకు లాభపడ్డాయి. మార్కెట్లలో భయాన్ని సూచించే ఇండియా విక్స్ (VIX) 19 శాతం మేర తగ్గింది.

"హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే, సురక్షితంగా తెరిస్తే.. రెండు వారాల పాటు ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తాం. ఇది ఇరుపక్షాల కాల్పుల విరమణ" అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు కిక్ ఇచ్చింది. ఈ ప్రకటనతో ఆసియా మార్కెట్లు సైతం భారీగా లాభపడ్డాయి. మరోవైపు, యుద్ధ భయాలు తగ్గడంతో ముడి చమురు ధరలు కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 15.91 శాతం తగ్గి బ్యారెల్ 91.88 డాలర్లకు చేరగా, యూఎస్ డబ్ల్యూటీఐ క్రూడ్ ఏకంగా 20 శాతం పడిపోయి 91.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

కాగా, మంగళవారం నాటి ట్రేడింగ్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (FIIలు) రూ. 8,692 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (DIIలు) రూ. 7,980 కోట్ల కొనుగోళ్లు చేశారు. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాలు కూడా వెలువడనున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇంకా కొనసాగుతున్నందున, ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Go Back to Shorts
Stock Markets
Sensex
Nifty
Share Market
Indian Stock Market
Crude Oil Prices
Donald Trump
Iran
US
FII
DII

More Telugu News