తెలంగాణ డీజీపీ కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం.. స్వల్పంగా దెబ్బతిన్న వాహనాలు

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ప్రమాదం చోటు చేసుకుంది. డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో పోలీసులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ క్రమంలో వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళుతుండగా ఒక పోలీసు వాహనం అదుపుతప్పి ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు వెంటనే ఆ వాహనాలను పక్కకు తొలగించారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు.

కర్రెగుట్టలోని పామునూరు సీఆర్పీఎఫ్ బస్ క్యాంపును డీజీపీ పరిశీలిస్తారు. ఆ తర్వాత పోలీసు ఔట్ పోస్టుకు భూమి పూజ చేస్తారు. ఆ ప్రాంతంలోని గ్రామాలకు వేస్తున్న రోడ్లను పరిశీలిస్తారు. డీజీపీ కర్రెగుట్ట పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆయన స్థానిక గుత్తికోయలతో సమావేశం కానున్నారు.

Shiva Dhar Reddy
Telangana DGP
Telangana Police
Mulugu District
Convoy Trial Run
Road Accident

More Telugu News