Nora Fatehi: ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం

నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన 'సర్కే చునార్ తేరి' పాట వివాదంపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసుకున్న కమిషన్, సోమవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు గేయ రచయిత రకీబ్ ఆలం, దర్శకుడు ప్రేమ్, కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధులు హాజరై, తమ తప్పును అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు.

కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ అధ్యక్షతన జరిగిన ఈ విచారణలో, పాటలోని సాహిత్యం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాటకు అర్థం తెలియదని చెప్పడం సరికాదని అన్నారు. సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచడం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం చేయవద్దని చిత్ర బృందానికి గట్టిగా హెచ్చరించారు. దీనిపై స్పందించిన వారు, సమాజంలో తప్పుడు సంకేతాలు పంపినందుకు క్షమాపణలు చెబుతూ.. రాబోయే 3 నెలల్లో మహిళా సాధికారత కోసం పనిచేసి, నివేదిక సమర్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ విచారణలో నటి నోరా ఫతేహి తరఫున ఆమె న్యాయవాది హాజరుకాగా, కమిషన్ దానిని అంగీకరించలేదు. ఏప్రిల్ 27న ఆమె వ్యక్తిగతంగా హాజరు కావడానికి చివరి అవకాశం కల్పించింది. వృత్తిపరమైన కారణాలతో విదేశాల్లో ఉన్నానని తెలిపిన నటుడు సంజయ్ దత్‌ను ఏప్రిల్ 8న తప్పనిసరిగా కమిషన్ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

'కేడీ: ది డెవిల్' సినిమాలోని ఈ పాట, అసభ్యకరమైన సాహిత్యం, కొరియోగ్రఫీ కారణంగా విడుదలైన వెంటనే తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. గాయకుడు అర్మాన్ మలిక్‌తో సహా పలువురు దీనిపై విరుచుకుపడ్డారు. వివాదం ముదరడంతో, మేకర్స్ ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించారు.
Nora Fatehi
Nora Fatehi song controversy
Sanjay Dutt
National Women Commission
KD The Devil movie
Rakib Alam lyricist
Prem director
Vijay Rahatkar
Armaan Malik song criticism
Cirkut Chunnar Teri song

More Telugu News