Panchumarthi Anuradha: అమరావతిపై నీ కుట్రలు ఇక సాగవు జగన్: పంచుమర్తి అనురాధ

వైసీపీ తీరు ఒక రాజకీయ పార్టీలా కాకుండా, ప్రజలను మభ్యపెట్టే 'డ్రామా కంపెనీ'లా తయారైందని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని విషయంలో ఆ పార్టీ ఆడుతున్న నాటకాలు పరాకాష్ఠకు చేరాయని, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు వ్యతిరేకంగా జగన్ చేస్తున్న కుట్రలు ఇకపై సాగవని ఆమె హెచ్చరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ నేతల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.

అసలు దోపిడీ అంటే ఏంటో తెలుసా?

అమరావతిలో దోపిడీ జరుగుతోందని జగన్ ఆరోపించడంపై అనురాధ తీవ్రంగా మండిపడ్డారు. "జగన్ గారూ.. అసలు దోపిడీకి, అభివృద్ధికి మధ్య ఉన్న తేడా మీకు తెలుసా?" అని ఆమె ప్రశ్నించారు. అసలైన దోపిడీ అంటే ఏంటో వివరిస్తానంటూ ఆమె పలు ఉదాహరణలు ఇచ్చారు. "తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రో కో పద్ధతిలో వేల కోట్లు సంపాదించడాన్ని దోపిడీ అంటారు. అక్రమ ఆస్తుల కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి బెయిల్ మీద తిరగడాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే చేనేత కార్మికుడిని ముగ్గు గనుల కోసం పొట్టనబెట్టుకోవడాన్ని, 'సాక్షి' మీడియాను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేయడాన్ని, భారతి సిమెంట్స్ కోసం నిబంధనలు ఉల్లంఘించడాన్ని దోపిడీ అంటారు" అంటూ నిప్పులు చెరిగారు.

మద్యం, భూముల కుంభకోణాలపై విమర్శలు

"మద్యపాన నిషేధం అని చెప్పి, జే-బ్రాండ్ల మద్యాన్ని అమ్ముతూ డిజిటల్ చెల్లింపులు లేకుండా నెలకు రూ.100 కోట్లకు పైగా బ్లాక్ మనీని జేబులో వేసుకోవడాన్ని ఏమంటారు? ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తామని చెప్పి, విశాఖలో 41 వేల ఎకరాల భూములను కొట్టేయడాన్ని దోపిడీ అంటారు. పందికొక్కుల్లా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేయడం, ఇసుకను బంగారం చేసి పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడం వంటివన్నీ దోపిడీ కాదా?" అని అనురాధ ప్రశ్నించారు. అన్యమతస్తులను టీటీడీ చైర్మన్‌లుగా నియమించి, స్వామివారి సొమ్మును కొల్లగొట్టిన పాపం మిమ్మల్ని వెంటాడుతోందని ఆమె వ్యాఖ్యానించారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్న కుట్రలు

అమరావతి అభివృద్ధిని ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే, వైసీపీ నేతలు మాత్రం బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అంతర్జాతీయ యూనివర్సిటీలు, ఐటీ కంపెనీలు వస్తుంటే అడ్డుకోవడం మీ అవివేకం కాదా? పదేళ్లయినా రాజధాని లేదని దేశమంతా జాలి పడుతుంటే, మీకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేదు" అని విమర్శించారు. రాజధానిని ఎలా దెబ్బతీయాలా అనే కుట్రతోనే వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టించి విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

లోకేశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?

గతంలో ముఖ్యమంత్రిగా జగన్ ఎన్ని అబద్ధాలు ఆడారో, ఎన్ని యూ-టర్న్‌లు తీసుకున్నారో నారా లోకేశ్ వీడియో సాక్ష్యాలతో సహా బయటపెట్టారని అనురాధ గుర్తుచేశారు. "లోకేశ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీకు ఉందా? అమరావతిపై అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న కుట్రలకు పొంతన లేదని ఆయన ట్వీట్ చేస్తే బదులివ్వలేకపోయారు" అని ఆమె అన్నారు. 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతుల గొప్పతనాన్ని ఓర్వలేకే ఈ కక్ష సాధింపు చర్యలని దుయ్యబట్టారు.

ప్రజలు తిరస్కరించినా మారని వైఖరి

ప్రజలు కేవలం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని అనురాధ విమర్శించారు. "పార్టీని ఎలా బాగు చేసుకోవాలో ఆలోచించకుండా, ఇంకా అమరావతిపై విషం చిమ్ముతున్నారు. మీ సైకో తత్వాన్ని పక్కనపెట్టి వాస్తవాలు మాట్లాడటం నేర్చుకోండి. అభివృద్ధిని అడ్డుకున్న పాపం మిమ్మల్ని వదిలిపెట్టదు" అని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర రాజధానిపై విషం చిమ్మడం ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, ప్రతి కుట్రకు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని ఆమె స్పష్టం చేశారు.
Panchumarthi Anuradha
Amaravati
Andhra Pradesh
YS Jagan
YSRCP
Nara Lokesh
Capital City
Political Conspiracy
Corruption Allegations
Real Estate

More Telugu News