Chandrababu Naidu: బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన చంద్రబాబు!
భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయవాదం, సమగ్ర అభివృద్ధి పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధతను ఆయన కొనియాడారు.
బీజేపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులందరికీ చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతిని, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో, సేవారంగంలో బీజేపీ నిరంతరం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపక నేతల నుంచి అందరి కృషిని గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్ణయాత్మక పాలన, స్పష్టమైన అభివృద్ధి లక్ష్యంతో దేశాన్ని బీజేపీ మరింత బలోపేతం చేసిందని కొనియాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సారథ్యంలో పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొత్త ఉత్సాహంతో, వేగంతో ప్రజలకు సేవలు అందిస్తోందని చంద్రబాబు తెలిపారు. ఇది సహకార సమాఖ్య స్ఫూర్తికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశసేవలో అంకితభావంతో పనిచేస్తూ, 'వికసిత్ భారత్' వైపు సాగుతున్న మన ప్రయాణాన్ని బీజేపీ మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నట్లు చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.