Janhvi Kapoor: 15 ఏళ్లకే ఆ నరకం చూశాను: డీప్‌ఫేక్ ఫొటోలపై జాన్వీ కపూర్
టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నటి జాన్వీ కపూర్, తన టీనేజ్ రోజుల్లో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ, టెక్నాలజీ దుర్వినియోగం వల్ల తాను ఎదుర్కొన్న మానసిక వేదనను బయటపెట్టింది.
స్కూల్ రోజుల్లో జాన్వీకి కేవలం 15 ఏళ్లు ఉన్నప్పుడు, ఆమె ఫొటోను సాంకేతికతతో అసభ్యకరంగా మార్చి ఒక అశ్లీల వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. తన స్నేహితురాలు ఆ ఫొటోను చూపించే వరకు తనకు విషయం తెలియదని, అది చూసి ఏం చేయాలో పాలుపోక ఎంతో ఏడ్చానని ఆమె ఎమోషనల్ అయింది. సోషల్ మీడియాలో నైతికత ఉండదని ఆ చిన్న వయసులోనే తనకు అర్థమైందని, భవిష్యత్తులో ఇలాంటివి ఎదుర్కోవడానికి అప్పుడే మానసిక ధైర్యాన్ని పెంచుకున్నానని తెలిపింది.
ఇప్పుడు తనపై వచ్చే నెగటివ్ కామెంట్లను లేదా మార్ఫింగ్ ఫోటోలను పెద్దగా పట్టించుకోనని జాన్వీ స్పష్టం చేసింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి సవాళ్లు తప్పవని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే మార్గమని ఆమె యువతకు సూచించింది.
కెరీర్ విషయానికి వస్తే... ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జాన్వీ, ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది.