Kavitha: కవిత కొత్త పార్టీకి ‘టీఆర్ఎస్’ పేరు?.. తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు!

Kavitha to Launch New Party Possibly Named TRS Sparks Political Buzz
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో వేగం పెంచారు. ఈ నెల 25వ తేదీన పార్టీని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆమె, దానికి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (టీఆర్ఎస్) పేరును పరిశీలిస్తున్నట్లు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. "పాత పేరు, కొత్త జెండా, కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తాను" అని ఆమె చెప్పడం ఈ చర్చకు మరింత బలాన్నిచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యమంతో ముడిపడిన పేరును కవిత సొంతం చేసుకోబోతున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.

కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ, 'భారత రాష్ట్ర సమితి' (బీఆర్ఎస్)గా మారడంతో ప్రస్తుతం టీఆర్ఎస్ పేరు ఎవరైనా వాడుకోవచ్చని కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌తో పాటు టీఆర్ఎస్ పేరుతో ముడిపడిన భావోద్వేగాలను తనవైపు తిప్పుకోవాలనేది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, పార్టీ పేరు టీఆర్ఎస్ అయినా జెండాలో మాత్రం గులాబీ రంగు ఉండదని ఆమె స్పష్టం చేశారు. తమ పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల పునాదిపై నడుస్తుందని, 'బిహార్ సిద్ధాంతాలకు' తమ పార్టీలో చోటుండదని స్ప‌ష్టం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం తెలంగాణ జాగృతి బృందం ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద 'తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ' పేరుతో ప్రక్రియ ప్రారంభించింది.

తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని కవిత ప్రకటించారు. అదే సమయంలో బీఆర్ఎస్‌ను 'ధనిక పార్టీ'గా ఆమె అభివర్ణించారు. పార్టీ ఆవిర్భావం రోజున అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి, ఉద్యమకారులతో కలిసి వేదికను పంచుకుంటామని తెలిపారు. డీఎస్పీ విశారదన్ మహరాజ్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో సిద్దిపేట లేదా గజ్వేల్‌లో మహిళా రిజర్వేషన్లు అమలైతే అక్కడి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కవిత సూచనప్రాయంగా తెలిపారు. ఆడబిడ్డకు ఓటేయడం అనేది ఒక ఎమోషన్ అని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ మద్యం కేసు కొట్టివేతను ఉద్దేశిస్తూ.. "అదృష్టవంతుడిని ఎవరూ ఆపలేరు, ప్రకృతి నాకు సహకరిస్తోంది" అని ఆమె అన్నారు. భగవద్గీతలో ఉన్న నీతి ప్రకారం యుద్ధం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు కష్టపడి పనిచేస్తారని, పార్టీ నిర్మాణంలో టీడీపీ చాలా బలంగా ఉంటుందని ప్రశంసించడం గమనార్హం.
Go Back to Shorts
Kavitha
Kalvakuntla Kavitha
TRS
Telangana Rashtra Samithi
BRS
Telangana politics
Telangana Praja Jagruti Party
Telangana Movement
KCR
Telangana Elections

More Telugu News