SRH vs LSG: ఉప్పల్‌లో పరుగుల వరద ఖాయం.. నేడు సన్‌రైజర్స్, లక్నో బిగ్ ఫైట్

ఐపీఎల్ 2026లో మరో పరుగుల పండుగకు రంగం సిద్ధమైంది. విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు హోరాహోరీ పోరుకు సై అంటున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా నేడు ఈ రెండు జట్ల మధ్య సమరం జరగనుంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఐపీఎల్ పదో మ్యాచ్ అయిన ఈ పోరు, డబుల్ హెడర్‌లో భాగంగా మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సొంత మైదానంలో ఆడుతుండటం సన్‌రైజర్స్‌కు కలిసొచ్చే అంశం కాగా, గత రికార్డులు మాత్రం లక్నోకు అనుకూలంగా ఉన్నాయి. 

లక్నోదే పైచేయి..
గత రికార్డులను పరిశీలిస్తే, సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఆరుసార్లు తలపడగా, అందులో నాలుగు మ్యాచ్‌లలో లక్నో విజయం సాధించింది. సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే గెలుపొందింది. గతేడాది ఇదే ఉప్పల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 190 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 16.1 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది. ఈ రికార్డు లక్నో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది.

జట్లలో మార్పులు ఇలా..
తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మూడో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతని గైర్హాజ‌రు జట్టుకు కొంత ప్రతికూలాంశం. బౌలింగ్ విభాగంలో డేవిడ్ పైన్ స్థానంలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన బ్రైడన్ కార్స్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా అదే కూర్పుతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మొత్తం మీద హోం గ్రౌండ్ అడ్వాంటేజ్‌తో సన్‌రైజర్స్ బరిలోకి దిగుతుండగా, పాత రికార్డులతో లక్నో ధీమాగా ఉంది. ఈ బ్యాటర్ల యుద్ధంలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు(అంచనా):
మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, ఆయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమ్మద్, ముకుల్ చౌదరి, దిగ్వేష్ రాఠీ, మొహమ్మద్ షమీ, నోకియా, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్ / హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్స్ / డేవిడ్ పైన్, ఈషాన్ మలింగ.
SRH vs LSG
Sunrisers Hyderabad
IPL 2026
Lucknow Super Giants
SRH vs LSG
Rajiv Gandhi International Stadium
Pat Cummins
Travis Head
Heinrich Klassen
Cricket Match
T20 League

More Telugu News