Peddi Movie: 'పెద్ది' వాయిదా పుకార్లకు చెక్.. రిలీజ్ డేట్‌పై ఫుల్ క్లారిటీ

Ram Charan Peddi Release Date Confirmed Overseas Bookings Open Soon
షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ చిత్రం వాయిదా పడుతోందంటూ వచ్చిన ప్రచారానికి రామ్ చరణ్ స్వయంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. అనుకున్న తేదీకే, అంటే ఏప్రిల్ 30నే 'పెద్ది' థియేటర్లలోకి వస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల 'రాకాస' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

వాస్తవానికి ఇంకా 20 రోజుల షూటింగ్, ఒక ఐటెం సాంగ్ చిత్రీకరణ మిగిలి ఉండటంతో సినిమా వాయిదా పడుతుందని ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరిగింది. దీనికి తోడు హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో రిలీజ్ డేట్ లేకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే, ఈ పుకార్లలో వాస్తవం లేదని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శరవేగంగా ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నామని, కేవలం వారం రోజుల్లోనే ఐటెం సాంగ్‌తో సహా మిగిలిన చిత్రీకరణను ముగించి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసే పనిలో నిమగ్నమయ్యామని మేకర్స్ తెలిపారు.

విడుదలపై వస్తున్న ఊహాగానాలను డిస్ట్రిబ్యూటర్ వర్గాలు కూడా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ప్రమోషన్లు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల‌ 8వ తేదీ నుంచే 'పెద్ది' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకానున్నాయి. దీంతో ఏప్రిల్ 30న సినిమా రావడం దాదాపు ఖాయమైనట్లేనని స్పష్టమవుతోంది. శ్రీరామనవమికి విడుదలైన 'పహిల్వాన్' గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

'రంగస్థలం' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పూర్తిస్థాయి గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం కావడంతో 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చయ్యమ్మ'గా కథానాయిక పాత్ర పోషిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ 'గౌర్నాయుడు'గా, జగపతి బాబు 'అప్పలసూరి'గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాయి.
Go Back to Shorts
Peddi Movie
Ram Charan
Ram Charan Peddi
Janhvi Kapoor
Shiva Rajkumar
AR Rahman
Telugu cinema
Mythri Movie Makers
Sukumar Writings
Overseas bookings

More Telugu News