TG Govt: తెలంగాణ ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే.. ఒక్క 'హాయ్'తో అన్నీ!

Telangana Government Services on WhatsApp with Just a Hi
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాల కోసం మీ-సేవ, ఇంటర్నెట్ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా, వాటన్నింటినీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లోకి తీసుకొచ్చేందుకు 'వాట్సాప్ చాట్‌బాట్' విధానాన్ని ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 80969 58096 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఒక్క నంబర్‌తోనే రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ సేవలను పొందేలా 'వన్ స్టాప్ షాప్' తరహాలో దీనిని రూపొందించారు.

ప్రజలు ఈ వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని మెసేజ్ పంపితే చాలు, వివిధ సేవలతో కూడిన ఒక మెనూ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం మీ-సేవ పోర్టల్‌లో లభించే కులం, ఆదాయం వంటి సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోవడం, వాటి స్టేటస్ తెలుసుకోవడం, మున్సిపల్ పన్నులు చెల్లించడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల శాఖలకు సంబంధించిన కీలక సమాచారం కూడా పొందవచ్చు. ఇటీవల ఇంటర్, పదో తరగతి, ఇతర ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించి ప్రభుత్వం విజయవంతంగా పరీక్షించింది.

గతంలో వేర్వేరు ప్రభుత్వ శాఖలకు వేర్వేరు వెబ్ పోర్టళ్లు ఉండటంతో ప్రజలు తీవ్ర గందరగోళానికి గురయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిర్యాదుల నమోదు నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు అన్నీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పాలనలో పారదర్శకత, వేగం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

రానున్న రోజుల్లో ఈ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను మరింత విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం, అర్హతలు తెలుసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల వివరాలు కూడా దీనికి అనుసంధానించనున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసే నగదు వివరాలను కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలను కూడా ఇదే వేదికగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వ అధికారిక సందేశాలు, అలర్ట్‌లు కూడా ఇకపై ఇదే నంబర్ ద్వారా ప్రజలకు చేరనున్నాయి.
Go Back to Shorts
TG Govt
Revanth Reddy
Telangana government services
WhatsApp chatbot
e-governance
MeeSeva
Telangana state
government schemes
certificate application
hall tickets
municipal taxes

More Telugu News