Udhayanidhi Stalin: రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం

Udhayanidhi Stalin Declares Assets Worth 1272 Crore Wife Owns 187 Crore Gold
షార్ట్స్‌లో చూడండి
డీఎంకే యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.33 కోట్లు అని తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా ప్రకటించారు.

భార్య కృతిగా ఉదయనిధికి రూ.13.25 కోట్ల విలువైన చరాస్థులు ఉన్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. ఆమె పేరిట ఎలాంటి స్థిరాస్థులు లేవని వెల్లడించారు. తనకు లేదా తన కుటుంబ సభ్యులకు ఆర్థిక సంస్థల వద్ద ఎలాంటి రుణాలు, బకాయిలు లేవని పేర్కొన్నారు. తన వద్ద రూ.50 వేలు, తన భార్య వద్ద రూ.75 వేల నగదు ఉన్నట్లు తెలిపారు. పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, షేర్లు, వాహనాల రూపంలో తన చరాస్థి మొత్తం విలువ రూ.12.92 కోట్లుగా ఉందని తెలిపారు.

తన వద్ద రూ.1 కోటి విలువైన డిఫెండర్ కారు, రూ.33 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉన్నాయని తెలిపారు. తన వద్ద బంగారం, వెండి లేవని పేర్కొన్నారు. తన భార్య వద్ద మాత్రం 1,800 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ రూ.1.87 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉదయనిధి స్టాలిన్ తన వార్షిక ఆదాయాన్ని రూ.10,40,620గా, తన భార్య వార్షిక ఆదాయం రూ.2,92,54,570గా ప్రకటించారు.

తనకు ఎమ్మెల్యేగా వేతనం, సినిమా పరిశ్రమ నుంచి వచ్చే పారితోషికం ప్రధాన ఆదాయవనరుగా పేర్కొన్నారు. తనకు తిరువళ్లూరు జిల్లా ఉలుందై గ్రామంలో సుమారు 11 ఎకరాల వ్యవసాయ భూములు, వేళచ్చేరిలోని డాక్టర్ సీతాపతి నగర్‌లో 2,400 చదరపు అడుగుల స్థలం, రాయపేట్టైలోని ఇంద్రా గార్డెన్, పళ్లికరణైలోని రాజేశ్ నగర్‌లో నివాసాలు ఉన్నాయని తెలిపారు. ఇద్దరికి రూ.1.55 లక్షలు అప్పు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తనపై 10 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు తెలిపారు.
Go Back to Shorts
Udhayanidhi Stalin
Udhayanidhi Stalin assets
Tamil Nadu elections
Chepauk Thiruvallikeni constituency

More Telugu News