Kalvakuntla Kavitha: ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు

Kalvakuntla Kavitha suggests measures for AI job losses
షార్ట్స్‌లో చూడండి
కృత్రిమ మేధ (ఏఐ-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కారణంగా చాలామంది ఉద్యోగాలు పోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక సూచన చేశారు. ఏఐ వల్ల జరుగుతున్న ఉద్యోగ నష్టాన్ని అధిగమించడానికి మూడంచెల ఒక ప్రత్యేక చట్టం అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు.

ఒకటి జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం, రెండోది సామాజిక రక్షణ, పరిశ్రమ భాగస్వామ్యం మరియు నైపుణ్యాభివద్ధి పెంచడం ద్వారా ఏఐ ఆధారిత ఉద్యోగ నష్టాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సూచనలతో కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కార్యాలయానికి ట్యాగ్ చేశారు.

చేనేత కార్మికుల జీవితాలు అంధకారంలోకి నెట్టేసే కుట్ర

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో చేనేతకారుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసే కుట్రలు చేస్తోందని కవిత ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఉన్న విద్యాశాఖ ఆధ్వర్యంలోని యూనిఫామ్‌ల ఆర్డర్‌ను ఏకపక్షంగా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్లపై ఎంతోమంది చేనేత కార్మికులు ఆధారపడ్డారని, ఈ ప్రభుత్వం వారి పొట్ట కొట్టిందని విమర్శించారు.

విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే రూ.105 కోట్ల విలువైన యూనిఫామ్‌ల ఆర్డర్ ద్వారా వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తుంటుందని తెలిపారు. కానీ ఈసారి ఆర్డర్ రద్దు చేయడం దారుణమని అన్నారు. సంక్షేమ శాఖలు, ఇతర డిపార్టుమెంట్లకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి సంబంధించిన ఆర్డర్‌ను సైతం టెస్కోకు ఇవ్వకపోవడం కార్మికులను సంక్షోభంలోకి నెట్టివేయడమేనని ధ్వజమెత్తారు.

గడువు ముగిసినప్పటికీ టెస్కోకు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. తమకు కావాల్సిన ప్రైవేటు వ్యక్తులకు ఈ ఆర్డర్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చేనేత కార్మికులకు అన్యాయం చేసే చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
Go Back to Shorts
Kalvakuntla Kavitha
AI job losses
Artificial Intelligence
Telangana Jagruthi
handloom workers

More Telugu News