Arun Dhumal: ఐపీఎల్ విలువ తగ్గే ప్రసక్తే లేదు.. మరింత పెరుగుతుంది: ఛైర్మన్ అరుణ్ ధూమల్

ఐపీఎల్ మీడియా హక్కుల విలువ రాబోయే సీజ‌న్ల‌లో తగ్గుతుందంటూ వస్తున్న ఆందోళనలను టోర్నీ ఛైర్మన్ అరుణ్ ధూమల్ కొట్టిపారేశారు. విలువ తగ్గకపోగా, మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 2023-27 సైకిల్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ప్రస్తుత సైకిల్‌లో దేశీయ టెలివిజన్ హక్కులను డిస్నీ స్టార్ 3.02 బిలియన్ డాల‌ర్ల‌కు, స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్18 3.05 బిలియన్ డాల‌ర్ల‌కు దక్కించుకున్నాయి. ధూమల్ మాట్లాడుతూ.. "మీడియా రంగంలో చాలా విలీనాలు జరిగాయి. కానీ ఐపీఎల్ విషయానికి వస్తే, ఏ మీడియా సంస్థకైనా ఇంత ఆసక్తిని కలిగించే మరో క్రీడా ఈవెంట్ లేదు. ఇది అద్భుతమైన లైవ్ స్పోర్ట్స్ కంటెంట్. ఇక్కడ ప్రతి బంతీ ఒక ఈవెంట్ లాంటిది" అని వివరించారు.

"తదుపరి మీడియా హక్కుల సైకిల్ నాటికి, ప్రస్తుత కంపెనీలతో పాటు కొత్త సంస్థల నుంచి కూడా తీవ్రమైన ఆసక్తి ఉంటుంది. కాబట్టి విలువ తగ్గడానికి నాకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదు. టోర్నీ అభివృద్ధి చెందిన‌ తీరు, అది సృష్టించిన విలువ కారణంగా తదుపరి సైకిల్‌లో హక్కుల విలువ మరింత పెరుగుతుందని నేను భావిస్తున్నాను" అని ధూమల్ అన్నారు.

సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్‌కు మారినా ఐపీఎల్‌కు డిమాండ్ తగ్గదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "నాణ్యమైన కంటెంట్ కోసం డబ్బు చెల్లించడానికి ప్రజలు వెనుకాడరు. ఒక సినిమా కోసం వందల రూపాయలు ఖర్చు చేయడంతో పోలిస్తే, ఒక లైవ్ గేమ్ కోసం రూ. 5, 10 లేదా 25 ఖర్చు చేయడానికి ఎవరు ఆలోచిస్తారు? లైవ్ గేమ్‌లో చివరి బంతి వరకు ఏం జరుగుతుందో తెలియదు" అని ఆయన తెలిపారు. ఫ్రాంచైజీలన్నీ లాభాల్లోనే ఉన్నాయని, ఐపీఎల్ కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదని, అదొక బలమైన వ్యాపార నమూనా అని ఆయన స్పష్టం చేశారు.
Arun Dhumal
IPL
Indian Premier League
IPL media rights
Disney Star
Viacom18
IPL Chairman
cricket tournament
sports business
media rights value

More Telugu News