Ponnam Prabhakar: అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఏర్పాటుకు చట్టబద్ధత కల్పిస్తూ లోక్ సభలో బిల్లు ఆమోదించడాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఇదే సమయంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో తెలంగాణకు పలు కీలక హామీలు  ఉన్నాయని, వాటి అమలు విషయంలో కేంద్రం వివక్షపూరితంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి కీలక ప్రాజెక్టులు ఇంకా ఆచరణకు నోచుకోలేదని అన్నారు. ఈ ప్రాజెక్టులు తెలంగాణ అభివృద్ధికి కీలకమని గుర్తుచేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు వంటి అంశాల్లో కూడా కేంద్రం మాట తప్పిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక రాష్ట్రానికి చట్టబద్ధతతో ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటూ, మరో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించడం సరైనది కాదని మంత్రి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar
Amaravati
Andhra Pradesh
Telangana
AP Reorganisation Act 2014

More Telugu News